Tuesday, February 21, 2012

ఆవాలు

            ఆవాలు 
'ఆవ గింజ అట్టే దాచి,గుమ్మడికాయ గుల్లకాసుగా ఎంచేవాడు' అంటారు ఉపయోగపడని దాన్ని భద్రపరచి,ఉపయోగకరమైన దాన్ని పట్టించుకోని అవివేకిని  గురించి.ఈ సామెత బహుశా ఆవగింజ యొక్క అతి చిన్న పరిమాణాన్ని బట్టి ఏర్పడి ఉంటుందేగానీ, ఆవగింజ ఉపయోగపడనిదని కాదు. మన పెద్దలకు ఆవగింజ ప్రయోజనాలు తెలియవనీ కాదు.'వాడి వల్ల నాకు ఆవగింజంత మేలు కూడా జరగలేదు' అనే వాడుక కూడా ఇలా ఆవగింజయొక్క  అతిచిన్న సైజునుబట్టే ఏర్పడింది.చూడ్డానికి  చిన్నదైనా ఆవగింజ ఉపయోగాలు  అన్నీ ఇన్నీ కావు.అందుకే మన ప్రాచీనులు ఆహారంలో, వైద్యంలో ఆవకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు.
సాహిత్యంలో ఆవ 
                          మన ప్రాచీన సాహిత్యంలోనూ 'ఆవ' ప్రస్తావనలున్నాయి.తెనాలి రామకృష్ణ కవి 'పాండురంగ మాహాత్మ్యం'లో ఆవను ఉవ్వెత్తుగా(ఎక్కువగా)తాగడాన్ని గురించి పేర్కొన్నాడు.ప్రాచీన  కాలం నుంచీ ఆవ రసాన్ని వమనకారి(Emetic)గానూ,విరేచనకారి(Purgative or Cathartic)గానూ,మూత్రకారి (Diuretic)గానూ వాడేవారు.విష పదార్థాలు మింగినవారిచేత ఆవనూనె లేక నీటిలో కలిపిన ఆవపిండి తాగించి వాంతులు చేయించేవారు.ఆవ పైత్యం,కాక చేయడమేకాక  అది ఉవ్వెత్తుగా(ఎక్కువగా) తీసుకున్నవారికి జాడించి విరేచనాలు అవుతాయి.మూత్రం జారీగా వెడలుతుంది.వాంతులు ఎక్కువగా అవుతాయి.'మంచి మీగడ గల పుల్ల పెరుగుతో ఆవబెట్టిన పచ్చళ్ళను ఆదరంతో చవిచూసినవారికి  ముక్కు  పుటాలనుంచి పొగలు వెడలుకొచ్చి , మంట నసాళానికి అంటింద'ని శ్రీనాథుడు తన 'శృంగార నైషధం' కావ్యంలో ప్రస్తావించాడు.వినుకొండ వల్లభరాయడు తన 'క్రీడాభిరామం' కావ్యంలో పల్లె ప్రాంతాలలోని భాగ్యవంతులు చద్ది అన్నపు మాడుముద్దలను పొద్దున్నే లేత ఆవ ఆకు కూరతోనూ,పేరిన నెయ్యితోనూ, మీగడ పెరుగుతోనూ కలిపి తింటారని రాశాడు.క్రైస్తవుల మతగ్రంథం 'బైబిల్'లోనూ,గ్రీకు,రోమన్ రచనలలోనూ ఆవాల ప్రస్తావన చాలా తరచుగా చేయబడింది.
                  బ్రస్సికేసీ(Brssicaceae) కుటుంబానికి చెందిన ఆవ మొక్కలలో  మూడు  రకాలున్నాయి.వీటి  గింజలనే ఆవాలు అంటాం.వీటి  నుంచి  ఆవనూనె తీస్తారు. తెలుగులో  ఎర్ర ఆవాలు అని కూడా పిలువబడే   గోధుమ రంగు ఆవాలు Indian Mustard(Brassica juncea) మొక్క  నుంచి  వస్తాయి.
రేప్ సీడ్స్ మరియు ఆయిల్ 
ఆవ జాతికే చెందిన బ్రస్సికా చినెన్సిస్,బ్రస్సికా నేపస్,బ్రస్సికా కాంపేస్ట్రిస్ తదితర రకాల   మొక్కల గింజలను' రేప్ సీడ్స్' అంటారు.ఇవీ  చూడడానికి ఆవాలలానే ఉంటాయి. రేప్ సీడ్స్ లో కొన్ని పసుపు రంగులోనూ ఉండటాన కొందరు వాటిని పసుపు పచ్చ ఆవాలు అని వ్యవహరిస్తున్నారు. అయితే తెల్ల ఆవాలు (సిద్ధార్థ లేక శ్వేత సర్షప) గా పిలువబడే ఆవాలు కూడా చూడడానికి కొంత పసుపు   రంగులోనే ఉంటాయి. రేప్   గింజలనుంచి తీసే ముడి వంటనూనెను' రేప్ సీడ్ ఆయిల్' అంటారు.బ్రెడ్ తయారీలోనూ,దీపాలకు చమురుగానూ,సబ్బుల తయారీలోనూ ఈ ముడి నూనెను వాడతారు. దీన్నే శుద్ధిచేస్తే' కొల్జా ఆయిల్'అని పిలుస్తారు.ఇదికూడా వంట నూనెగానూ, సున్నితమైన యంత్ర పరికరాలకు కందెన(Lubricant)గానూ   వాడతారు.ఈ నూనె చెక్క(Oil cake)ను పశువుల దాణాగానూ, పంటలకు ఎరువుగానూ వాడతారు.మనం కూరల్లో వాడుకునే బ్రోకోలీ, కాలీ ఫ్లవర్,క్యాబేజీ,  నూల్-కోల్, టర్నిప్ లు కూడా ఇదే కుటుంబానికి చెందినవే.
                        తెల్ల ఆవాలను సంస్కృతంలో 'సర్షప','కటుస్నేహ','చారు సర్షప' వగైరా పేర్లతో పిలుస్తారు.ఇవి కారంగా,చేదుగా ఉంటాయి.వాత జ్వరాన్నీ,శ్లేష్మ జ్వరాన్నీ,క్రిమి రోగాన్నీ,దురదలనూ, చర్మ రోగాలనూ  పోగొడతాయి.'కుష్ఠ నాశ 'అనికూడా పిలువబడే తెల్ల ఆవాలు కుష్ఠు వ్యాధికి దివ్యౌషధం.హిందీలో 'సఫేద్ రాయ్' అని పిలువబడే వీటి శాస్త్రీయ నామం Brassica alba.రెండు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క ఆకులు నూగుగానూ,పూలు పసుపు పచ్చగానూ ఉంటాయి.విత్తనాలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి బయటకు పసుపుపచ్చగానూ, లోపల తెల్లగానూ ఉంటాయి.
                          సంస్కృతంలో 'కృష్ణ సర్షప','ఆసురీ','తీక్ష్ణ గంధా' మొదలగు పేర్లతో పిలిచే నల్ల ఆవాలు కారంగా,చేదుగా,జిగటగా, రుచికరంగా ఉంటాయి.పొత్తికడుపు నొప్పి,కఫము, గుండె జబ్బు,దృష్టి దోషము, రక్త దోషము-- వీటిని పోగొడతాయి.నల్ల ఆవాల పొడిని మజ్జిగతో కలిపి తీసుకొంటే దురదలు, దద్దుర్లు,కుష్ఠు పుళ్లు వగైరా నయమౌతాయి.నల్ల ఆవాల పొడిని గోమూత్రము, నువ్వుల నూనె తో కలిపి కాచి ఆ నూనెతో తల అంటుకుంటే కుష్ఠు వ్యాధి నశిస్తుంది.హిందీలో 'బనారసీ రాయ్' అని పిలువబడే నల్ల ఆవాల శాస్త్రీయ నామం Brassica nigra.ఈ మొక్కలు ఆరు అడుగుల వరకు ఎత్తు పెరిగి పసుపు పచ్చటి పూలు పూస్తాయి.
                            సాధారణంగా మనం ఇళ్ళలో ఎక్కువగా వాడుకునే ఎర్ర ఆవాలను సంస్కృతంలో 'సుముఖా','సుప్రశస్తా' అనే పేర్లతో పిలుస్తారు.వీటికి' 'శోఫ  హారీ ' (వాపులూ, కణుతులను పోగొట్టేవి),  'నిద్రాకర' (నిద్రమత్తు కలిగించేవి), 'దాహకారీ'(దాహాన్ని కలిగించేవి) అనే పేర్లు కూడా ఉన్నాయి.
                            శ్లో. కఫానిల విషశ్వాస కాసదౌర్గంధ్య నాశన:
                                 పిత్త హృత్ పార్శ్వ శూలఘ్న స్సుముఖస్సముదాహృత:    (ధన్వంతరి నిఘంటువు)
                             ఎర్ర ఆవాలు కఫం, వాతం,విష శ్వాస,కాస దుర్గంధం నశింపజేస్తాయి.పిత్తాన్ని హరించి, పార్శ్వ శూలను నయం చేస్తాయి.
               అన్ని రకాల ఆవాల నుంచి  ఆవ నూనె తీస్తారు. తెల్ల ఆవాల నుంచి తీసే నూనెను ఉద్రేకాల ఉపశమనానికీ, దీపాల చమురుగానూ, కందెనగానూ ఉపయోగిస్తారు. నల్ల ఆవాలనుంచి తీసే నూనె ఘాటుగా ఉంటుంది.అది తగిలితే చర్మం మీద బొబ్బలు వస్తాయి.ముక్కులోనూ,కళ్ళలోనూ ఉండే పలుచటి చర్మపు  పొరలకు  ఈ నూనె హాని చేస్తుంది.దీన్ని సబ్బులు, మందుల తయారీలో వాడతారు.ఎర్ర ఆవాల నుంచి తీసే నూనె ఇలా ఘాటుగా ఉండదు.ఈ ఆవ నూనెను వంట నూనెగానూ, తలంటుకూ , ఒంటి మర్దనకూ ఉపయోగిస్తారు.
                  ఆవ పొడిని కొద్దిగా వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే వెంటనే వాంతులు అవుతాయి.ఆవ పిండి నోటిలోని ఉమ్మి గ్రంధులను ఉత్సాహపరచి, నోరూరింప జేస్తుంది.కడుపులోని పేగుల్లో కదలిక తెచ్చి విరేచనం అయ్యేట్లు చేస్తుంది.  లేత ఆవ ఆకులు,మొలకెత్తిన ఆవ విత్తనాలు ఆకు కూరగా వాడుకుంటారు. ఈ కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంచం వెగటుగా అనిపించినా ఆవకూర త్రిదోషాలనూ హరిస్తుంది. నీళ్ళ విరేచనాలనూ, పైల్స్ (మూల వ్యాధి)నూ తగ్గిస్తుంది. నీళ్ళ విరేచనాలు కట్టుకోడానికి   వేయించి కొట్టిన  ఆవ పొడిని కొద్దిగా వేడి అన్నంపై వేసి నేతితో తినిపిస్తారు.  ఆవ కూర గొంతుక రోగాలను కూడా  తగ్గిస్తుంది. ఎక్కువగా తింటే ఆవకూర మూత్ర బద్ధం చేస్తుంది.దీనికి విరుగుడు చండ్ర చెక్క పొడి.పాశ్చాత్యదేశాల్లో ఆవ పొడిని ఉప్పు, వెనిగర్ ,ధనియాలు,లవంగాలు,దాల్చిని చెక్క మొదలైనవి పొడి చేసి పేస్టులా  కలిపి పెట్టుకుని, ఆ పేస్టును కూరలలో వాడుకుంటారు.నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు చల్లటి నీటిలో మెత్తటి ఆవ పిండిని కలిపి మలాం పట్టీలాగా వేస్తారు.విష పదార్థాలు, ప్రమాదకరమైన మత్తు పదార్థాలు తీసుకున్న వారికి ప్రథమ చికిత్సగా  ఆవ పిండిని వేడి నీళ్ళలో కలిపి తాగించి వాంతి చేయిస్తారు.నరాల వ్యాదులకూ,కీళ్ళ సవాయికీ నల్ల ఆవాలు దివ్యౌషధం.న్యుమోనియా(Pneumonia), ప్లూరసీ (Pleurisy) వగైరాలలో నల్ల ఆవాల పొడితో మలాం పట్టీ వేస్తారు.నల్ల ఆవాలకు స్త్రీలకు గర్భపాతం కలిగించే, గర్భం రాకుండా నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి.
                 ఆవ నూనెతో తలంటుకున్నా  లేక తలంటుకు కొంచెం ముందుగా మెత్తటి ఆవపిండిని వేడి నీళ్ళతో కలిపి ఆ పేస్టును తలకు పట్టించినా  తల చర్మం (Scalp) లోని క్రిములు నశిస్తాయి. ఆవ పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే అన్ని చర్మ రోగాలు, క్రిమి రోగాలు, కుష్ఠు మొదలైన మొండి వ్యాధులు కూడా నశిస్తాయి. శరీర తత్త్వాన్నిబట్టి కొందరికి ఇది వికటించే అవకాశమున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెవిలో రెండు ఆవనూనె చుక్కలు వేసుకుంటే చెవిపోటు, వినికిడి సమస్యలు తగ్గిపోతాయి.ఆవ నూనెను వంటకు వాడుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.అగ్నిమాంద్యం నశించి ఆకలి పెరుగుతుంది. రేచీకటికి కూడా ఆవ దివ్యౌషధం.ఉదర రోగాలనీ, నీరసాన్నీ పోగొడుతుంది. ఆవ నూనెతో రోజూ కూరల తిరుగమోతలు పెట్టుకుంటూ,పై పూతగా ఆవనూనె రాస్తూ ఉంటే బోద కాలు నయమౌతుంది.ఆవాల పొడి ఉప్పు కలిపి నూరి తయారుచేసిన చూర్ణంతో పళ్ళు తోముకుంటూ ఉంటే దంత రోగాలు నశించి పళ్ళు దృడంగా తయారౌతాయి.ఆవాలు, మునగ చెక్క మెత్తగా నూరి పట్టు వేస్తే చెవి గూబ వాపు తగ్గుతుందని'భావ ప్రకాశిక' పేర్కొంది.
  పక్షవాతానికి 
ఆవ పిండిలో వాతులు కలిగించే,మూత్రం జారీచేసే గుణాలే కాక నరాల వ్యవస్థకు చురుకుదనం కలిగించే గుణం(Nervine Stimulant) కూడా ఉంది.ఆ కారణంగానే 
పక్షవాత రోగులకు ఆవ మేలు చేస్తుంది.ఆవ పొడిలో కొద్దిగా సిరకా (వెనిగర్)వేసి మెత్తగా కలిపి  పక్షవాతంతో పడిపోయిన శరీరభాగం పైన పట్టు వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆవ పొడిలో వెనిగర్ పోసి పలుచగా చేసిన పేస్టుతో రోజూ పడిపోయిన శరీర అవయవాలపైన రుద్దుతూ ఉంటే ఆ అవయవాలలో క్రమంగా కదలికలు వస్తాయి.ఆవ పొడితో కాచిన కషాయాన్ని రోజూ రెండు పూటలా తాగిస్తే పక్షవాతం క్రమంగా  నయమౌతుంది.
                  ఆవ  నూనెలో హారతి కర్పూరం కలిపి మర్దన చేస్తే కండరాలలోని వాతపు నొప్పులు, మెడ కండరాల బిగుతు(Stiffness of the neck) తగ్గుతాయి.డెంగ్యూ వ్యాధిగ్రస్థులకు ఒంటిపై ఆవనూనె పూస్తే ఉపశమనం కలుగుతుంది.బ్రాంఖై టిస్ తో   బాధపడుతున్నపసిపిల్లలకు చాతీ పై ఆవనూనె పూస్తే దగ్గు తగ్గుతుంది.
                    ఆవ పూలకు కూడా వైద్య పరమైన ప్రయోజనం ఉంది.తెల్ల ఆవ పూలను నీటితో నూరి, పలుచటి పేస్టులాగా తయారుచేసి ఒక గుడ్డపై వేసి కడుపు పైభాగంలో పట్టీ వేస్తే  కలరా రోగికి వచ్చే తగ్గని మొండి వాంతులు తగ్గుముఖం పడతాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితులలో ఆ పట్టీ  శరీరం పై పది నిముషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. అలా ఎక్కువసేపు ఉంచితే బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.'సిద్ధార్థ' లేక 'శ్వేత సర్షప' అనికూడా పిలిచే తెల్ల ఆవాలతో తయారుచేసే 'సిద్ధార్థ ఘ్రుతం' ఎన్నో రుగ్మతలకు దివ్యౌషధం.వాచిన శరీర భాగాలపై తెల్ల ఆవాల నూనె తో రుద్దితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.తెల్ల ఆవ నూనె వంటనూనెల్లో శ్రేష్ఠమైనది. మూర్చ రోగులకూ, ఉన్మాదులకూ సిద్ధార్థ ఘ్రుతం బ్రాహ్మీ ఘ్రుతం తో కలిపి ఇస్తే ప్రయోజనం ఉంటుందని ' ఇండియన్ మెటీరియా మెడికా' గ్రంథంలోడా. కె.యం.నద్కర్నీ  పేర్కొన్నారు.నల్ల ఆవాలు పాము కాటు సందర్భంగా విష హరణానికీ వాడతారు.
ఆవతో ధూపన చికిత్స 
            ఆపరేషన్ తరువాత కుట్లువేసిన భాగాలలో చీముపట్టడం,మంట వగైరాలు రాకుండా సాధారణంగా వైద్యులు రోగికి  యాంటీ బయాటిక్స్, నొప్పి నివారక మందులు ఇస్తారు.పుణెలో ఓ వైద్యుడు ' వేపాకులు,గుగ్గులు,ఆవాలు,వస కొమ్ము ,ఉప్పు --వీటిని సమభాగాల్లో తీసుకుని' నిప్పులపై వేస్తే వచ్చిన పొగని పెద్ద ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వరసగా పదిరోజులపాటు ఉదయం, సాయంత్రం వేసి చూస్తే ఆపరేషన్ చేసిన భాగాలు ఏడు రోజుల్లోనే మానిపోయాయని 'గిరిజన వైద్య సర్వస్వం' అనే తన గ్రంథంలో డా.కొప్పుల హేమాద్రి పేర్కొన్నారు.
 విషమ జ్వరాలకు 
                  విషమ జ్వరాల  నివారణకు ఇలాంటి ధూపన చికిత్సే 'చరక సంహిత' లోని' చికిత్సా స్థానం' అనే అధ్యాయంలో కూడా చెప్పబడింది.పలంకష (Bdellium) అనే  సాంబ్రాణి వంటి ధూప ద్రవ్యం,వేప ఆకులు,వస కొమ్ములు,ఆవాలు,యవలు (బార్లీ), కుష్ఠం(చెంగల్వ కోష్టు - Saussurea lappa) , హరీతకీ (కరక్కాయ), నెయ్యి -ఈ  ద్రవ్యాలతో ధూపం వేస్తే ఎంతటి విషమ జ్వరమైనా నశిస్తుంది.('చరక సంహితా'--3 -307 ) 
కుష్ఠు వ్యాధి నివారణకు 
        ' సర్షప కరంజ కోశాతకీనాం తైలాన్యథా ఇంగుదీనాం చ '  అంటూ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు చరకుడు తన' చరక సంహిత' లోని 'చికిత్సా స్థానం' లో ('చరక సంహితా ' 7-119) కుష్ఠు నివారణకు పనిచేసే వివిధ తైలాలలో సర్షప తైలాన్నీ (ఆవ నూనెనూ) పేర్కొన్నాడు.మిగిలిన తైలాలు కరంజ(కానుగ- Pongamia glabra),కోశాతకీ (చేదు బీర-Luffa amara), ఇంగుదీ( గార-Balanites roxburghii)-- విత్తనాలనుండి తీసినవి.
            కుష్ఠు వ్యాధి నివారణకు వాడే' తిక్తేక్ష్వాక్వాది తైలం' కాయడానికి వాడే ద్రవ్యాలలో ఆవనూనె అతి ప్రధానమైనది.దారు హరిద్రా (మాను పసుపు),తిక్తాలాబు(చేదు సొర),పసుపు,ఏరండం(ఆముదం), మయూర,ఖర్పరిక అనే రెండు రకాల తుత్తము(Copper Sulphate) --వీటన్నింటినీ కలిపి ఆవ నూనెతో కాయాలని చరకుడు పేర్కొన్నాడు.(శ్లో.108-110- చికిత్సా స్థానం -'చరక సంహితా') 
              ఆవకు ఇంకా వైద్యపరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి.తెలుసుకొనాలనే ఉత్సాహమున్నవారు ఇక్కడ ఉదాహరించిన  గ్రంథాలు చదివి గ్రహించవచ్చు.
          
ఆహారంలో ఆవ 
                ఆవ పిండి కలిపి చేసే తాజా రోటి పచ్చళ్ళు , ఊరగాయలు మన  తెలుగువారి ఇళ్ళల్లో నోరూరిస్తూ ఉంటాయి.ఆవకాయ ఇష్టపడని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! మామిడికాయ ఆవకాయ కేవలం రుచిగా ఉండడమే కాక, జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. పప్పన్నంలో అందుకే ఆవకాయ పచ్చడి కలుపుకు తింటారు. ఆవకాయ పచ్చడి వాతాన్ని పోగొడుతుంది కానీ పైత్యం, కాక చేస్తుంది.కొత్తగా పచ్చళ్ళు పట్టినప్పుడు అన్నంలో  ఆవకాయతోనే ఎక్కువగా లాగించేస్తుంటాం.ఇలా ఆవకాయ మోతాదుకు మించి తినడం వల్ల కలిగే దుష్ఫలితాలకు నెయ్యి, పెరుగు, మజ్జిగ, కలి నీళ్ళు విరుగుళ్ళు. నెయ్యి వేసుకు తింటే ఆవకాయ రుచి తెలియదని కొందరు నెయ్యి వేసుకోరు.కాని మోతాదుకు మించి ఆవకాయతో తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినడమే మంచిది.దంచిన జొన్నలనుగానీ,బియ్యాన్ని కానీ  అన్నంగా వండబోయే ముందు నీటితో కడుగుతాం కదా.ఆ కడుగు నీటిని బానల్లో పోసి పులియబెడితే 
వచ్చేవే కలి నీళ్ళు.మితిమీరిన ఆవ ప్రభావానికి కలి నీళ్ళు  బలమైన విరుగుడు.
               మన తెలుగువారి ఇళ్ళలో ఉసిరికాయతోనూ,  ఆవకాయ ఊరగాయ పడతారు. దోస ఆవకాయ, దొండ ఆవకాయ, కాలీ ఫ్లవర్ ఆవకాయ మొదలైన తాజా పచ్చళ్ళు కూడా ఆవపిండి కలిపి చేస్తారు.గోదావరి జిల్లాలలో కూరలలోనూ ఆవ వాడకం ఎక్కువ.మిగిలిన ప్రాంతాల్లో కేవలం తిరుగమోతలూ, పచ్చళ్లలో మాత్రమే ఆవాలూ, ఆవ పిండీ వాడితే ఆ జిల్లాలలో కూరల్లో కూడా ఆవ పిండి కలుపుతారు.దీన్ని ఆవపెట్టడం అంటారు.
ఆవపెట్టిన పనస కూర, ఆవపెట్టిన కంద -బచ్చలి కలగూర రుచిలో వాటికవే సాటి.
                  ఇన్ని ప్రయోజనాలున్న ఆవను మనం నిర్లక్ష్యం చేస్తే ఆ సామెతలోని అవివేకి కంటే కూడా అవివేకులం అవుతాం కదా! అందుకే నేటినుంచీ 
మన ఆహారంలో ఆవ తగు మోతాదులో ఉండేట్లు జాగ్రత్త పడదాం.