Monday, July 22, 2013

పెండలం

                                                 
            
 మనకి తెలుసు --  ‘హాట్ చిప్స్’ షాపుల్లో పెండలం చిప్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుందని.  అడపాదడపా మనం ఇళ్ళల్లో పెండలం వేపుడు కూర, పులుసు చేసుకుంటూనే ఉంటాం. కొందరు పెండలాన్ని  పిండిగా  చేసి, దానితో రొట్టెలు చేసుకు తింటారు. ఆరు నెలలపాటైనా చెడకుండా నిల్వ ఉండే పెండలం దుంపలు కరవు ప్రాంతాలవారికి చక్కటి ఆహారం. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ‘ఫుఫు' ( fufu) అనే వంటకాన్ని దీని నుంచే తయారు చేస్తారు. కొలంబస్, వాస్కో- డ-గామా, మాజిలాన్ మొదలైన సముద్రాన్వేషకులు మహాసముద్రాలపై ఓడల్లో చేసిన సుదీర్ఘ ప్రయాణాల్లో  ఈ పెండల౦ దుంపలే  వారి ఆకలిని  తీర్చాయి.  ఇప్పుడు అసలీ పెండలం ఏమిటో, దాని కథేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.

 వివిధ పెండలం జాతులు- వాటి పేర్లు

           భారతదేశపు యాభైకి పైబడిన  పెండలం జాతుల్లో పెద్ద పెండలం, చిన్న పెండలం ప్రధానమైనవి. మిగిలినవన్నీ అటవీ జాతులు కాగా, ఈ రెండు మాత్రమే సాగుచేయబడుతున్నాయి. పెద్ద పెండలాన్ని సంస్కృతంలో ‘ఆలూకమ్’ అనీ, ‘పిండాలు ‘ (పిండ+ఆలు) అనీ అంటారు. ఈ ‘పిండాలు’ శబ్దాన్ను౦చే తెలుగులో ‘పెండలం' శబ్దం ఏర్పడింది.  దీన్ని హిందీలో ‘చుప్రి ఆలు' అనీ, ‘ఖమాలు' అనీ అంటారు. కన్నడంలో ‘తెంగుగెనసు' అనీ, ‘హెగ్గెనసు' అనీ అంటారు. తమిళంలో ‘పెరుంవళ్ళిక్కిళంగు' అనీ, .మలయాళంలో ‘కాచ్చిల్' అనీ  అంటారు. ఇంగ్లిష్ లో ‘గ్రేటర్ యాం'  (Greater Yam)  అంటారు. చిన్న  పెండలాన్ని  తమిళంలో ‘వల్లీ కిళంగు'అనీ, ఇంగ్లిష్ లో Lesser Yam అనీ అంటారు. మనం  ఎక్కువగా ఈ రెండు రకాలనూ దుంపకూరగా వాడుకు౦టాం.

                     ఉష్ణ ప్రాంతాల్లో పెరిగే  పెండలం డయోస్కోరియేసీ (Dioscoreaceae) కుటుంబానికి చెందిన ఏక వార్షిక తీగ మొక్క.  ఇది యాభై అడుగుల వరకు పొడుగు  పెరుగుతుంది. పెద్ద పెండలం  శాస్త్రీయ నామం ‘డయోస్కోరియా ఆలాటా' (Dioscorea alata) కాగా  చిన్న పెండలం శాస్త్రీయనామం ‘డయోస్కోరియా  ఎస్కులెంటం' . ఆధునిక వృక్ష విజ్ఞానానికి ఆద్యుడు, ‘మెటీరియా మెడికా' గ్రంథకర్త,  క్రీ.శ. ఒకటవ శతాబ్దికి చెందిన గ్రీకు విజ్ఞాని పెడానియోస్ డయోస్కోరిడీజ్ (Pedanios Dioscorides) పేరిట ఈ  తీగ మొక్కకు ఆయన పేరు పెట్టబడింది.’ఆలాటా' అంటే ‘రెక్కలు కలది'(Winged) అని అర్థం. ఈ తీగ మొక్క కాండానికి (బీరకాయపైన తేలిన నరాలలాగానే)  పైకి తేలిన నాలుగు రెక్కలుంటాయి. తమలపాకుల్ని పోలిన ఈ తీగ ఆకులు హృదయాకారంలో  ముదురు ఆకుపచ్చ, లేతగా ఉన్నప్పుడు  ముదురు చాక్లెట్  రంగుల్లో  నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటాయి. ఆకులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. భూమిలోని వీటి వేళ్ళు దు౦పలుగా ఊరతాయి.ఒక్కొక్క దుంప ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల   బరువు వరకు కూడా ఊరతాయి.  దుంప పైభాగం  గరుకుగానూ,  పైన అంతా సన్నటి రోమాలు, బుడిపెలు  కలిగి ఉంటుంది.  దుంప లోపల జిగురుగల పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది.  ఈ తీగ వేళ్ళు నేలలో  దుంపలుగా  ఊరడమేకాక ఈ దుంపలు ఒక్కోసారి  ఈ తీగ  కాండం మీద కూడా వస్తాయి. వీటిని ‘ ఏరియల్ ట్యూబర్స్’ లేక ‘బల్బిల్స్' (Bulbils) అంటారు.కొందరు వీటిని పెండలపు కాయలు అని కూడా అంటారు.

                  ఇక ‘ఎస్కులెంటం’  (esculentum)   అంటే ‘ఆహారంగా ఉపయోగించేది’ అని అర్థం. (లాటిన్ లో ఎస్కా అంటే ఆహారం).ఈ మొక్క  వేళ్ళు  గుత్తులుగా ఊరతాయి. కేరళలోని పర్వత ప్రాంతాల్లో లభించే రుచికరమైన పెండలం జాతి శాస్త్రీయ నామం డయోస్కోరియా హామిల్టనీ (D. hamiltonii). పేదలు కరవు రోజుల్లో ఆహారంగా వాడుకునే మరోరకం  చిరు చేదు పెండలం డయోస్కోరియా బల్బీ ఫెరా(D. bulbifera).  దీన్ని హిందీలో పీత - ఆలూ అంటారు. చాణక్యుడు (కౌటిల్యుడు)రాసిన ‘అర్థశాస్త్రమ్' లో  ప్రస్తావించిన విషపూరితమైన పెండలం  డయోస్కోరియా డీమొనా (D. daemona). ఇది ఎంతగా విషపూరితమంటే- ప్రాచీన కాలంలో  పులుల్ని చంపడానికి ఈ దుంపల్ని వాడేవారట. ఇవికాక కష్-కష్ యాం, చైనీస్ యాం, గినీ యాం మొదలైన విదేశీ పెండలం రకాలు రుచికరమైనవిగా పేరొందాయి.

ఎక్కడినుంచి వచ్చింది ?

        పెండలం యొక్క ఇంగ్లిష్ పేరు ‘యాం' కు మూలం ‘నియాం' అనే శబ్దం. ఇది ‘మాండే’ భాషా శబ్దం. సుసులు, మాండేలు, మెండిస్ లు మొదలైన ఆఫ్రికా ఖండపు పశ్చిమ తీరంలో  నివసించే  జాతుల ప్రజలు
మాట్లాడే భాష ‘మాండే'. ఇది కాంగో భాషా కుటుంబం లోనిది.  వాయవ్య  ఆఫ్రికా నుంచి జిబ్రాల్టర్ జలసంధి గుండా  స్పెయిన్ లో ప్రవేశించిన మూరిష్ బానిసల (అరబ్బు, బర్బర జాతుల సంకరం కారణంగా పుట్టినవారు) ద్వారా ఈ శబ్దం  మొట్ట మొదటగా స్పెయిన్ లో ప్రవేశించింది. అయితే మూరిష్ జాతీయులు చేమ  దుంపల్ని ‘నియాం’అనేవారు. ఆ తరువాత స్పానిష్, పోర్చుగీసు ప్రజలు పెండలాన్ని ‘నియాం' అనడం మొదలెట్టారు.    ఈ శబ్దం ఆంగ్ల భాషలో ‘యాం' గా స్థిరపడక ముందు ఆంగ్లేయులు దీన్ని ‘ఇనియేం’(Iniame) అనీ, ‘యమ్మా’(Yamma) అనీ అనేవారు.అలా పెండలం పేరు వ్యుత్పత్తినిబట్టి అది  మూలంలో వాయవ్య ఆఫ్రికాకు చెందినదని  శాస్త్రజ్ఞులు ఊహించారు.


             ప్రపంచం మొత్తం మీద  పెండలం ( డయోస్కోరియా ) జాతిలో 600 కు పైగా ఉపజాతులున్నాయి. వాటిలో తినడానికి పనికొచ్చేవి  సుమారుగా పది   ఉంటాయి. ఈ జాతి  భూమి మీద గల  అతి  పురాతన వృక్ష జాతుల్లో ఒకటి. ఈ జాతి ఆఫ్రికా లోని ఉష్ణ ప్రాంతాలలో ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞులు తేల్చారు. పెండలాన్ని గురించి శాస్త్రజ్ఞులు తేల్చిన   అతి ఆశ్చర్యకరమైన విషయమొకటి ఉంది. అదేమిటంటే  పెండలం జాతులన్నిటికీ మూలమైన  ఆఫ్రికన్ పెండలం జాతి నుంచి ఆసియన్ పెండలం జాతులు విడివడి 26 మిలియన్ సంవత్సరాలకు పైనే అయిందట !!  అంటే -- రెండు కోట్ల అరవై లక్షల సంవత్సరాలపైనేనన్నమాట.

               భారతదేశపు పెండలం జాతి  దుంపలు  గోళాకారం, U- ఆకారం -- ఇలా వివిధ ఆకారాల్లోనూ, తెలుపు, ఎరుపు,  ఇంకా ముదురు ఎరుపు- నీలం రంగుల మిశ్రమ వర్ణంలోనూ  లభిస్తాయి. నేడు భారతదేశంలో పెరుగుతున్న  పెద్ద పెండలం జాతి జన్మస్థానం బర్మా- థాయిలాండ్ ప్రాంతం అయివుంటుందని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.  చిన్న పెండలం కూడా అదే ప్రాంతంలో ఉద్భవించినా, ఈ రెండు జాతుల సంకర రకాల్ని మనం పపూవా న్యూ గినీ లో ఎక్కువగా చూడొచ్చు. అటవీ పెండలం (డయోస్కోరియా పర్సిమిలిస్-  D.persimilis)  పై విశేష పరిశోధనలు చేసిన  స్కాట్లాండ్ కు చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు సర్  డేవిడ్ ప్రెయిన్ (1857-1944), ఇంగ్లాండ్ కు చెందిన వృక్ష శాస్త్రజ్ఞుడు ఐజాక్ హెన్రీ  బర్కిల్ ( 1870-1965)  భారతీయ పెండలం జాతులన్నీ బర్మా-థాయిలాండ్ ప్రాంతాలనుంచి భారతదేశానికి వచ్చాయని తేల్చారు.వీరి పరిశోధనల ఫలితంగా మొత్తం పెండలం జాతి రెండుగా వర్గీకరించబడింది. ఒకటి తీగ కుడివైపుకు అల్లుకుని పెరిగేవి. రెండు తీగ ఎడమ పక్కకు అల్లుకునేవి.పెద్ద పెండలం కుడి వైపుకు అల్లుకుని పెరిగే తీగ కాగా చిన్న పెండలం తీగ ఎడమ వైపుకు అల్లుకుని పెరుగుతుంది.

పెండలం సాగు

           పెండలం తీగల్ని దొడ్లలో పెంచుకోవడమే ఎక్కువ.  పంటగా సాగు చేయడమూ ఉంది. అయితే  అచ్చంగా  పెండలమే కాకుండా  అల్లం, పసుపు, వంగ, చిలగడ దుంప లేక మొక్కజొన్న లో అంతర పంటగా  పెండలాన్ని సాగుచేస్తారు.  పెండలం సాగుకు సారవంతమైన, లోతుగా దున్నిన భూమి శ్రేష్ఠం. పేడ  ఎరువు వాడుకుంటే దుంపలు బాగా ఊరతాయి.  నేలలో తేమ ఎక్కువగా ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు మురుగు నీరు పారుదల అయ్యే భూములే పెండలం సాగుకుమేలైనవి. ఎందుకంటే పెండలం ఆకులు, కాండం నీటి తడిని  ఏమాత్రం తట్టుకోలేవు. నేలలో తేమ ఎక్కువగా ఉన్నచోట్ల  తీగ ఆకులు, కాండం  కుళ్లకుండా కొందరు తీగలకు పందిళ్ళు వేసి,  వాటిపైకి పాకిస్తారు. పెండలం దుంపల పైభాగం కోసి విత్తితే మొలకలొస్తాయి. తీగకు కాసే పెండలం కాయల్నీ విత్తుకోవచ్చు. అయితే ఇలా కాయల నుంచి మొలిచిన తీగలకు పెండలం దుంపలు ఊరాలంటే  కనీసం రెండేళ్ళ  సమయం పడుతుంది. సాధారణంగా .తొలకరి వానల తరువాత పెండలం విత్తుకుంటారు. తీగలు నేలమీద అల్లుకుని పెరిగినప్పటికంటే, పందిరిపైకో  లేక ఏవైనా చెట్ల కొమ్మల మీదికో వాటిని పాకించినప్పుడు దుంపల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. విత్తిన నాటి నుంచి ఐదు నుంచి ఎనిమిది మాసాల్లో పంట చేతికొస్తుంది. దుంపలు పూర్తిగా ఊరిన తరువాత తీగకున్న  ఆకులు వాటంతటికవే రాలిపోతాయి. అప్పుడు తీగలు కత్తిరించి,  దుంపలు తవ్వి తీసుకోవాలి. కొన్ని పెండలం రకాల్లో  తీగ మొదలు దగ్గర ఒకటే దుంప ఊరితే, ఇంకొన్ని రకాల్లో  పలు దుంపలు  ఒకే గుత్తిగా ఉంటాయి. విత్తుకున్న రకాన్నిబట్టి, భూసారాన్ని బట్టి, చేనుకు అందించిన బలాన్నిబట్టి  దిగుబడి ఎకరాకు రెండు నుంచి పద్నాలుగు టన్నుల వరకు ఉంటుంది.పెండలం దుంపలు పొడి మట్టి లేక ఇసుకలో పాతిపెడితే ఆరు నెలల వరకు పాడు కాకుండా నిల్వ చేసుకోవచ్చు. నేల పొడిగా ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పెండలం తీగలు కోసేసిన తరువాత దుంపల్ని నేలలో అలాగే ఉంచేసి, అవసరం అయినప్పుడు తవ్వుకోవడం మంచిది.భారతదేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెండలం సాగు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలు, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలు పెండలం సాగుకు ప్రసిద్ధి.

ఆహారంగా పెండలం

               పెండలంలో   21 శాతం పిండి పదార్థాలు  ( 73 శాతం తేమ) ఉన్న కారణంగా  అది మంచి పోషక విలువలున్న ఆహారంగా పేరొందింది. ఆఫ్రికా, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలలోని పలు ప్రాంతాలలో దీన్ని ఆహార పంటగా పండిస్తున్నారు. పోషక విలువలున్న ఇదే జాతికి చెందిన  పలు అటవీ రకాలను కూడా ప్రజలు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పెండలం పంటలో
95 శాతం ఆఫ్రికా ఖండంలోనే పండిస్తున్నారు.నైజీరియా, బెనిన్, ఘనా, టోగో దేశాలు పెండలం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. పెండలాన్ని ముక్కలుగా కోసి, నూనెలో వేయించి, ఉడకబెట్టి లేక పిండి చేసుకుని ఆహారంగా  వాడుకుంటారు.  కరవులో వాడే ఆహారాలలో పెండలానిదే అగ్రస్థానం.అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో పెండలాన్ని పందులకూ, పశువులకూ పౌష్టికాహారంగా వాడుతున్నారు. కొన్ని జాతుల పెండలం      పై పొరలో ఆగ్జలేట్లు, ఆగ్జాలిక్ యాసిడ్ ఉండే కారణంగా అవి విషతుల్యం. పెండలం ముక్కల్ని కోసి, ఉడకబెట్టినా లేక వేయించినా వాటిలోని ఆల్కలాయిడ్లు, విషతుల్యమైన పదార్థాలు నశిస్తాయి. మనం కూరగాయగా వండుకునే శ్రేష్ఠమైన  విషరహితమైన రకాల పెండలాలు కూడా పచ్చివి తింటే, వాటిలో ఉన్న కాల్షియం ఆగ్జలేట్ క్రిస్టల్స్ కారణంగా నాలుక , గొంతు విపరీతంగా దురద పెడతాయి. అవే ఉడకబెట్టి లేక వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. సాగుచేస్తున్న పెండలం జాతులు రుచిలోనూ, నాణ్యత విషయంలోనూ  బంగాళా దుంపలతో పోటీ పడగలవు.  ఆలేటా ఉపజాతికి చెందిన పెండలం  స్టార్చ్ ని వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొన్ని జాతుల పెండలం దుంపల నుంచి ఆల్కహాల్ తయారు చేస్తున్నారు. కొన్నింటిలో  బి కాంప్లెక్స్ విటమిన్  పుష్కలంగా ఉన్నప్పటికీ పెండలంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ బాగా తక్కువే.  పెండలం జాతిలోని డెల్టాయిడియా మరియు ప్రజేరి ఉపజాతులు కంటి జబ్బుల్నీ,  కీళ్ళ వాతాన్నీ  నివారించేందుకు వాడే కార్టిజోన్ అనే స్టెరాయిడ్ హార్మోన్ ఉత్పాదనకు మూలం.ఆ రెండు ఉపజాతుల దుంపలనుంచి తీసిన స్టెరాయిడల్ శాపోజెనిన్ లు గర్భనిరోధక మాత్రల తయారీలో వాడతారు. డెల్టాయిడియా ఉపజాతి దుంపల్లో పుష్కలంగా ఉన్న శాపోనిన్ ల కారణంగా వాటిని పట్టు, ఊలు వస్త్రాలు మరియు కత్తిరించిన
శిరోజాలు శుభ్రపరిచేందుకు వాడతారు. చేప విషంగానూ ఉపయోగిస్తారు.

వైద్యంలో పెండలం   
                   
                పెండలం బాగా రుచిగా ఉంటుంది. మేహశాంతిని కలుగజేసి, బలాన్నీ, వీర్యపుష్టినీ ఇస్తుంది. నోటికి రుచి పుట్టిస్తుంది.  శరీరానికి చలువ చేస్తుంది.  కీళ్ళ వాతం (ఆర్త్రై టిస్ ) ని పోగొడుతుంది. కొద్దిగా కఫ, వాతాలు పెంచినా, పెండలం మూత్రకారిగా పేరొందింది. అది గు౦డెకూ, పొట్టకూ బలాన్నిస్తుంది.  పొట్టలోని క్రిములను నశింపజేస్తుంది. తీవ్రమైన పిత్త దోషం ఉన్నవారికి పెండలం ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధి, కుష్ఠు, గనేరియా, మూత్రం మంటగా చుక్కచుక్కగా పడడం, గుదంలో రక్తనాళం వాచి, తరచు రక్త స్రావం కావడం (హీమొర్రాయిడ్స్ -Haemorrhoids) మొదలగు వ్యాధులకు పెండలం దివ్యౌషధం.                                     
                   పెండలం పైత్యపు కాకనూ, దాహాన్నీ అణుస్తుంది. అయితే ఎక్కువగా తింటే అగ్నిమా౦ద్యం, మలబద్ధకం ఏర్పడవచ్చు. పొట్టలో వాయువు బిగదీయవచ్చు కూడా. ఇలాంటి సందర్భాల్లో విరుగుడుగా బెల్లం, తమలపాకులు పనిచేస్తాయి. పెండలపు తీగకు కాసే కాయలు కూడా పెండలపు దుంపలకున్న వైద్య పరమైన ప్రయోజనాలే కలిగివుంటాయి.

                             ఇదండీ పెండలం విచిత్ర గాథ. అప్పుడప్పుడూ పెండలంతో చేసిన చిప్స్, కూరలూ గట్రా తింటూ దాని ఉపయోగితా విలువలు నెమరేసుకుంటూ ఉంటారు కదూ! వచ్చే వారం మరో కూరగాథ తెలుసుకుందాం.
                
                                                       

చిలగడ దుంపలు

                                            
               వీటినే కొందరు ‘చిరగడ దుంపలు’  అంటారు.  కొన్ని ప్రాంతాల్లో ‘చిలగడము' అనీ, ‘గెనుసు గడ్డలు’ అనీ కూడా అంటారు.’శబ్ద రత్నాకరము' వీటిని ‘గెనసు' గా పేర్కొంది. వీటిలో ఎరుపు, తెలుపు-- ఈ  రెండు రంగుల దుంపలు లభిస్తాయి. చిలగడ దుంపల్ని నిప్పులమీద కాల్చుకుని లేక ఉడకబెట్టుకుని తింటారు. కొందరైతే  తియ్యగా ఉండే ఈ దుంపల్ని పచ్చివే తినేస్తారు. అయితే అవి తేలిగ్గా జీర్ణం కావాలంటే కాల్చడమో, ఉడికించడమో చెయ్యాలి. పోషక విలువలు  పూర్తిగా పొందడం   కోసం  వీటిని నిప్పులమీద కాల్చి, పొట్టు తీసుకుని తినడమే ఉత్తమం. కలగూర పులుసు, దప్పళము,  సాంబారు  వగైరాలలో  చిలగడ దుంప ముక్కలు వేస్తారు. కూరల్లో వాడుకోవడమే  కాదు; చిలగడ దుంపలతో పాయసమూ చేస్తారు.  ఈ దుంపల్ని మెత్తగా ఉడికించి, ఆ పిండితో పూర్ణపు బూరెలు, బొబ్బట్లు కూడా చేసుకుంటారు. ఈ దుంపల్ని బాగా ఎండబెట్టి మెత్తటి పిండిగా దంచి, ఆ పిండితో  ఉత్తర భారత దేశంలోని హిందువులు ఉపవాస దినాలలో తీపి బూరెలు, రొట్టెలు చేసుకు తింటారు.   తురిమిన చిలగడ దుంపల తొక్కుతో చేసే తాజా ఆవ పచ్చడి విందు భోజనాలలో  ఓ స్పెషల్ ఐటం ! ఇక ఇప్పుడీ చిలగడ దుంపల గాథేమిటో కొంచెం వివరంగా చూద్దాం.

మొక్క పేరు.. తీరు..

               సంస్కృతంలో చిలగడ దుంపల్ని ‘పిండాలుః ‘అనీ,  ‘రక్తాలుః ‘  అనీ అంటారు. హిందీలో ‘మీఠా ఆలు'  (తీపి బంగాళా దుంపలు) అనీ, ‘శక్కర్ కంద్’ (తీపి దుంప) అనీ అంటారు. ఆంగ్లంలో వీటిని ‘స్వీట్ పొటాటోస్’(తియ్యటి బంగాళా దుంపలు) అంటారు.కన్నడంలో వీటిని ‘సిహి గెణసు', మలయాళ౦లో‘ మధురక్కిళన్ను’ అనీ, తమిళ భాషలో ‘చక్కరవళ్లి క్కిళ౦గు' అనీ అంటారు. చిలగడ దుంప మొక్క సన్నటి,  నేలమీద పాకే  బహువార్షిక తీగ మొక్క.ఆకులు బల్లెం ఆకారంలో ఒక్కోసారి లోతైన చీలికలు కలిగి ఉంటాయి.పూలు వంగపండు రంగులో గొట్టాలవలె ఉంటాయి.కాయలు చిన్న గోళాలవలె ఉంటాయి.ప్రతి కాయలోనూ రెండునుంచి నాలుగు విత్తనాలుంటాయి. అవి చిన్నవిగా, బల్లపరుపుగా, నల్లగా ఉంటాయి. తీగ కాండం యొక్క మొదట్లోని వేళ్ళూ , కాండం నేలను తాకిన చోట  కణుపుల వద్ద పుట్టుకొచ్చే వేళ్ళూ  ఊరి  దుంపలుగా మారతాయి. ఒక్కో మొక్కకు బలాన్నిబట్టి రకరకాల పరిమాణాలలో నలభై నుంచి యాభై దుంపల వరకు వస్తాయి. కొద్ది అంగుళాల నుంచి మొదలెట్టి  ఒక్కోసారి ఈ దుంపలు అడుగు పొడవు  కూడా ఉంటాయి.అవి  గోళాకారంగానూ లేక నూలు కండె ఆకారంలోనూ ఉంటాయి.ఒక్కో దుంప బరువు కొద్ది ఔన్సుల మొదలు  రెండు మూడు పౌండ్లకు మించి కూడా ఉంటుంది.అరుదుగా మంచి కండ కలిగిన నేలల్లో ఒక్కో దుంప పన్నెండు పౌండ్ల బరువు వరకూ ఊరిన సందర్భాలూ ఉన్నాయి. ( రెండు పౌండ్ల మూడున్నర ఔన్సులు ఒక కేజీ బరువుకు  సమానం)

                చిలగడ దుంప మొక్క కన్వాల్వులేసీ (Convolvulaceae) కుటుంబానికి చెందినది.మన గ్రామీణులు  దూసరి తీగ అనే అతి గట్టిగా ఉండే తీగ మొక్కను కట్టు తీగగా వాడతారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో కట్టుతీగ (Bind Weed)గా ‘మార్నింగ్ గ్లోరీ’ అనే కన్వాల్వులస్ జాతికి చెందిన  తీగ మొక్కను వాడతారు. దాని పేరిటే  మార్నింగ్ గ్లోరీ  కుటుంబానికి కన్వాల్వులేసీ కుటుంబం అనే పేరు వచ్చింది. చిలగడ దుంప శాస్త్రీయ నామం ఐపోమీయా బటాటాస్ (Ipomoea batatas). గ్రీకు భాషలో ‘ఐప్స్'  అంటే ‘కట్టు తీగ మొక్క’ (మార్నింగ్ గ్లోరీ తీగ); ‘హోమోఇయోస్ ‘ అంటే ‘వంటి' అని అర్థం. మార్నింగ్ గ్లోరీ తీగలా ఉండే మొక్కలన్నింటినీ ‘ఐపోమియా’ పేరిటే వ్యవహరిస్తున్నారు. ఇక ‘బటాటాస్’ లేక ‘బటేటాస్’ అనేది కరీబియన్ దీవుల (వెస్ట్ ఇండీస్) లోనిదైన హైతీ దేశపు  వెస్ట్  ఇండియన్ మాండలిక పదం. చిలగడ దుంపల్ని సూచించే ఈ బటాటా పదం ను౦చే పొటాటో అనే పదం ఏర్పడింది. క్రీ.శ. 1597 లో జాన్ గెరార్డ్ అనే ఆయన మొదటిసారిగా బంగాళా దుంపల్ని వర్ణిస్తూ పొరపాటున వాటిని  కూడా  బటాటా అన్నాడు. ఇక అక్కడినుంచీ ఆంగ్లంలో పొటాటో (బటాటా) అనేది బంగాళా దుంపల పేరై కూర్చుంది.ఈ  చిలగడ దుంప మొక్కను పోలినవే నీటిలో పెరిగే తూటి కాడ /తీగ (ఐపోమియా యాక్వాటికా), నీటి దాపుల్లో పెరిగే జిరిక లేక కొల్లి (ఐపోమియా నీల్) మొక్కలు. ఈ మొక్కలన్నింటి ఆకులు,  గొట్టం పూలు, కాయలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.

ఎక్కడినుంచి వచ్చాయివి ?

              క్రీ.పూ.10,000-- 8000 మధ్య కాలం నాటివని భావించబడుతున్న గుహావశేషాలు చిలగడ దుంపల మూల జన్మస్థానం  నిస్సందేహంగా  దక్షిణ అమెరికా ఖండంలోని పెరు- మెక్సికో దేశాలేనని నిరూపించాయి. చిలగడ దుంప మొక్క ఐపోమీయా టిలియేసీ (Ipomoea tiliacea) అనే అటవీ జాతి మొక్క నుంచి ఆవిర్భవించిందనీ, ఆ మొక్క దక్షిణ అమెరికా ఖండపు ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే మొక్క అనీ శాస్త్రజ్ఞులు తేల్చారు.హవాయీ దీవులు, ఈస్టర్ దీవులు(చిలీ),  న్యూజీలాండ్ మొదలైన చోట్ల కూడా ఈ దుంపలకు సంబంధించిన అతి ప్రాచీన అవశేషాలు బయల్పడ్డాయి. ‘రామాయణమ్’ చిలగడ దుంపను   ‘పిండాలుక' అని పేర్కొంది. ప్రాచీన భారతీయ శస్త్ర చికిత్సా నిపుణుడు సుశ్రుతుడు చిలగడ దుంపల్ని మరింత స్పష్టంగా ‘మధ్వాలుక' (మధు+ఆలుక-- తీపి దుంపలు) అనే పేరుతో వ్యవహరించాడు. ప్రస్తుతం హిందీలో అందరూ వీటిని ‘శక్కర్ కంద్’ అంటున్నారు. ప్రాచీన తమిళ గ్రంథం ‘పురాణనూరు' ఈ దుంపల్ని ‘శక్కరై కిళ౦గు' అని పేర్కొంటూ అవి ఒక తీగమొక్క పాదం నుంచి ఉద్భవిస్తాయని పేర్కొంది.బహుశా ఈ చిలగడ దుంపలు మన దేశానికి దక్షిణ అమెరికా నుంచి కాక,  మనకు తూర్పుగా ఉన్న దక్షిణ పసిఫిక్, మైక్రోనేసియా ప్రాంతాల  నుంచి వచ్చి ఉండవచ్చునని కొందరు శాస్త్రవేత్తల అంచనా.  .క్రీ.శ. 1615 లో ఎడ్వర్డ్ టెర్రీ, క్రీ.శ.1678 లో జాన్ ఫ్రయర్  తమ రచనలలో ‘పొటాటోస్’అంటూ ప్రస్తావించింది చిలగడ దుంపల్ని గురించే కావచ్చు. ఎందుకంటే  బంగాళా దుంపలు అప్పటికింకా భారత దేశంలోకి ప్రవేశించలేదు.బ్రిటీష్ యాత్రికులు  బంగాళా దుంపలనే  కాదు చిలగడ దుంపలనూ  అప్పటికి౦కా  ఎరగరు. వారికి  ఈ రెండూ కొత్తవే. అందుకే వారు చిలగడ దుంపల్ని చూసే వాటిని పొరపాటుగా  ‘పొటాటోస్' అనే పేరుతో  వ్యవహరించి ఉంటారు. అలా రామాయణ రచనా కాలానికి పూర్వమే ఈ దుంపలు భారత దేశంలోకి దక్షిణ పసిఫిక్ ప్రాంతాలగుండా ప్రవేశించి ఉంటాయని భావించవచ్చు.

చిలగడ దుంప సాగు

       చిలగడ దుంపల్ని ఏడాది పొడుగునా సాగు చెయ్యవచ్చు. ప్రపంచంలోని ఉష్ణ ప్రాంతాలన్నిట్లో  ఈ దుంపల్ని సాగు చేస్తున్నారు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీటిని సాగు చేస్తున్నారు. ఇసుక నేలలు, వెచ్చటి తడి వాతావరణం ఈ దుంపల సాగుకు శ్రేష్ఠం.  దుంప పంటలలో బంగాళా దుంపలు, కర్ర పెండలం (Tapioca)లతరువాత సాగు విస్తీర్ణం రీత్యా  మూడవ స్థానం చిలగడ దుంపలదే. ఈ పంట సాగులో బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.  దేశంలో గెనుసు గడ్డల మొత్తం వార్షిక దిగుబడిలో అరవై శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే కావడం విశేషం. మిగిలిన నలభై శాతం పంట కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర,  తమిళ నాడు, ఒడిసా మొదలగు రాష్ట్రాల నుంచి వస్తుంది. వాస్తవానికి  మొదట్లో చిలగడ దుంపలు ఎరుపు, తెలుపు రంగుల్లోనే లభించినా ప్రస్తుతం  వివిధ దేశాల్లో పలు వర్ణాల దుంపలు-- తెలుపు, మీగడ రంగు, పసుపు, గోధుమ రంగు,  బంగారు వన్నె, ఎరుపు, గులాబీ వన్నె, రక్తవర్ణం మొదలైన పలు రంగుల్లో-- సాగవుతున్నాయి.  మన దేశంలో సాగయ్యే   ఎర్ర రంగు దుంపలు తెల్లవాటి కంటే తియ్యగా ఉంటాయి. ఉత్తర భారత దేశంలో  ప్రజలు ఎర్ర చిలగడ దుంపలు ఇష్టపడితే దక్షిణాదివారు  తెల్ల దుంపలు ఇష్టపడతారు. అయితే ఈ రెండు రకాల్లో ఎర్రవే తేలికగా జీర్ణమౌతాయి.  భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ రూపొందించిన ‘పూసా సఫేద్', ‘పూసా లాల్'  సంకర రకాలు మంచి దిగుబడినిచ్చే రకాలుగా రైతుల అభిమానాన్ని చూరగొన్నాయి.

          పిండి (Starch), పెక్టిన్, షుగర్ సిరప్,  మద్యం, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మొదలైనవాటి తయారీలో చిలగడ దుంపల్ని  ముడి సరుకుగా వాడతారు.   ఈ పిండిని వస్త్ర పరిశ్రమలోనూ, కాగితం, ఆహార మరియు కాస్మెటిక్ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు.ఈ దుంపలలో ఎ, బి, సి విటమిన్లు ఉన్నాయి. ప్రత్యేకించి ఎ విటమిన్ పుష్కలం.భారతీయ రకాలలో కంటే అమెరికన్ రకాలలో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయనీ, చిన్న దుంపలలో కంటే పెద్ద దుంపల లోనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయనీ, దుంపల పై భాగంలో కంటే లోపలి భాగాల్లోనే అవి  ఎక్కువగా ఉంటాయనీ శాస్త్ర పరిశోధనల్లో రుజువైంది.ఈ దుంపల్లో  చాలా కొద్ది మొత్తంలో మాంసకృత్తులు, కొవ్వులు  కూడా ఉంటాయి.

                    ఆకుపచ్చగా ఉన్న ఈ మొక్క ఆకుల్ని పశువులు ఆబగా తింటాయి. అవి  అత్యంత బలవర్థకమైన పశుగ్రాసమని రుజువైంది. ఈ దుంపల్లో నీటి శాతం చాలా ఎక్కువ(సుమారు 69 శాతం). ఆ కారణంగా అవి త్వరగా పాడయ్యే గుణం కలిగి ఉంటాయి.  మొత్తం ప్రపంచంలో పండే చిలగడ దుంపల్లో  ఏటా మూడో వంతు దుంపలు కుళ్ళి వృథా అవుతున్నాయట !! కుళ్ళి పాడయిన దుంపలతో సహా ఈ దుంపల్ని గుర్రాలు, పశువులు, పందులు అమిత ఇష్టంగా తింటాయి.

                       ఐపోమీయా జాతికి చెందిన మొక్కలలో కొన్ని వాటి ఆకర్షణీయమైన పూల కారణంగా ఉద్యానవనాల్లో పెంచబడుతున్నాయి.  చిలగడ దుంప గురించి చెప్పుకునేటప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన మరో విషయముంది.ఈ జాతికే చెందిన ఐపోమీయా డిజిటేటా (Ipomoea digitata) అనే మొక్క యొక్క పెద్ద దుంపను ‘భూ చక్కెర గడ్డ’(భూచక్ర గడ్డ) అంటారు. నా చిన్న తనంలో పసుపు, గోధుమ వన్నె కలగలసిన వర్ణం గల తోలుతో ఉన్న దాదాపు యాభై కేజీల బరువుండే అతి పెద్ద దుంపల్ని కొందరు స్కూళ్ళ దగ్గరకు తెచ్చి చాకుతో కొద్దికొద్దిగా  పొర తీసి, ముక్కలు కోసి అమ్మేవారు. ఆ  దుంప ముక్కలు తిమ్మిరి తిమ్మిరిగా అదో రకమైన రుచిగా ఉండి, అవి తిన్నవారికి వింత అనుభూతి కలిగేది. ప్రస్తుతం కనీసం చూద్దామన్నా ‘ భూ చక్కెర గడ్డలు’ఎక్కడా కానరావడం లేదు.

వైద్యంలో …

            ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ దుంపలు జీర్ణం కావడం చాలా కష్టమని  గుర్తించింది.  వీటిలో పీచు అతి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే ఇవి కడుపు ఉబ్బరాన్ని(Flatulence) కలిగిస్తాయి. అంచేత వీటిని పరిమితంగానే తీసుకొనడం మంచిది.  సంస్కృతంలో ‘ఆలు:’, ‘ఆలుక:’, ‘ఆలుకమ్' శబ్దాలు ‘తినదగిన వేరు దుంప'   (An esculent root) అనే అర్థాన్నిస్తాయి.    ‘రాజ నిఘంటు' అనే వైద్య నిఘంటువు  తెల్ల చిలగడ దుంపల్ని ‘పిండాలు' (పిండ+ ఆలు) అనీ, ఎర్ర చిలగడ దుంపల్ని ‘రక్తాలు' (రక్త+ఆలు) అనీ వ్యవహరించింది.ఈ రెంటిలో రక్తాలు (ఎర్రటి రకం )బలవర్ధకమైనది.ఈ రెండు రకాలూ కాక శ్రీలంకలో సాగయ్యే గుత్తి చిలగడ దుంపల్ని(Cluster Sweet Potato) కూడా కొందరు  శాస్త్రజ్ఞులు ప్రస్తావించారు. చిలగడ  దుంపలు శరీరంలోని ఉష్ణ తాపాన్నీ , జ్వరాన్నీ తగ్గిస్తాయి.  మూత్రకారిగానూ, విరేచనకారిగానూ ఇవి  పనిచేస్తాయి.  ఇవి బలవర్ధకమే కాక పురుషుల  సెక్స్ సామర్థ్యాన్నీ పెంచుతాయి. తీవ్ర పిత్త దోషాలు,  ఒంట్లో కాక, అరికాళ్ళ మంటలు, మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్ర పిండాలలోనూ, మూత్ర సంచిలోనూ ఏర్పడే రాళ్ళు, మూత్రం మంటతో చుక్కచుక్కగా పడడం (strangury),సాధారణ బలహీనత వగైరాలను పోగొడతాయి. తేలు కాటులో బాధా నివారణకు ఈ దుంపలను కానీ, ఈ తీగ ఆకుల్ని కానీ మెత్తటి పేస్టుగా చేసి రాస్తే ప్రయోజనం ఉంటుందని డా. కె. యం. నద్ కర్ణి తమ ‘ది ఇండియన్ మెటీరియా మెడికా' గ్రంథంలో పేర్కొన్నారు.

              
           

కవిరాజు త్రిపురనేని

కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి జీవితము, రచనలకొసం ఈ దిగువ గొలుసులో చూడండి.

 http://www.scribd.com/doc/155299125/kaviraju

Tuesday, February 21, 2012

ఆవాలు

            ఆవాలు 
'ఆవ గింజ అట్టే దాచి,గుమ్మడికాయ గుల్లకాసుగా ఎంచేవాడు' అంటారు ఉపయోగపడని దాన్ని భద్రపరచి,ఉపయోగకరమైన దాన్ని పట్టించుకోని అవివేకిని  గురించి.ఈ సామెత బహుశా ఆవగింజ యొక్క అతి చిన్న పరిమాణాన్ని బట్టి ఏర్పడి ఉంటుందేగానీ, ఆవగింజ ఉపయోగపడనిదని కాదు. మన పెద్దలకు ఆవగింజ ప్రయోజనాలు తెలియవనీ కాదు.'వాడి వల్ల నాకు ఆవగింజంత మేలు కూడా జరగలేదు' అనే వాడుక కూడా ఇలా ఆవగింజయొక్క  అతిచిన్న సైజునుబట్టే ఏర్పడింది.చూడ్డానికి  చిన్నదైనా ఆవగింజ ఉపయోగాలు  అన్నీ ఇన్నీ కావు.అందుకే మన ప్రాచీనులు ఆహారంలో, వైద్యంలో ఆవకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు.
సాహిత్యంలో ఆవ 
                          మన ప్రాచీన సాహిత్యంలోనూ 'ఆవ' ప్రస్తావనలున్నాయి.తెనాలి రామకృష్ణ కవి 'పాండురంగ మాహాత్మ్యం'లో ఆవను ఉవ్వెత్తుగా(ఎక్కువగా)తాగడాన్ని గురించి పేర్కొన్నాడు.ప్రాచీన  కాలం నుంచీ ఆవ రసాన్ని వమనకారి(Emetic)గానూ,విరేచనకారి(Purgative or Cathartic)గానూ,మూత్రకారి (Diuretic)గానూ వాడేవారు.విష పదార్థాలు మింగినవారిచేత ఆవనూనె లేక నీటిలో కలిపిన ఆవపిండి తాగించి వాంతులు చేయించేవారు.ఆవ పైత్యం,కాక చేయడమేకాక  అది ఉవ్వెత్తుగా(ఎక్కువగా) తీసుకున్నవారికి జాడించి విరేచనాలు అవుతాయి.మూత్రం జారీగా వెడలుతుంది.వాంతులు ఎక్కువగా అవుతాయి.'మంచి మీగడ గల పుల్ల పెరుగుతో ఆవబెట్టిన పచ్చళ్ళను ఆదరంతో చవిచూసినవారికి  ముక్కు  పుటాలనుంచి పొగలు వెడలుకొచ్చి , మంట నసాళానికి అంటింద'ని శ్రీనాథుడు తన 'శృంగార నైషధం' కావ్యంలో ప్రస్తావించాడు.వినుకొండ వల్లభరాయడు తన 'క్రీడాభిరామం' కావ్యంలో పల్లె ప్రాంతాలలోని భాగ్యవంతులు చద్ది అన్నపు మాడుముద్దలను పొద్దున్నే లేత ఆవ ఆకు కూరతోనూ,పేరిన నెయ్యితోనూ, మీగడ పెరుగుతోనూ కలిపి తింటారని రాశాడు.క్రైస్తవుల మతగ్రంథం 'బైబిల్'లోనూ,గ్రీకు,రోమన్ రచనలలోనూ ఆవాల ప్రస్తావన చాలా తరచుగా చేయబడింది.
                  బ్రస్సికేసీ(Brssicaceae) కుటుంబానికి చెందిన ఆవ మొక్కలలో  మూడు  రకాలున్నాయి.వీటి  గింజలనే ఆవాలు అంటాం.వీటి  నుంచి  ఆవనూనె తీస్తారు. తెలుగులో  ఎర్ర ఆవాలు అని కూడా పిలువబడే   గోధుమ రంగు ఆవాలు Indian Mustard(Brassica juncea) మొక్క  నుంచి  వస్తాయి.
రేప్ సీడ్స్ మరియు ఆయిల్ 
ఆవ జాతికే చెందిన బ్రస్సికా చినెన్సిస్,బ్రస్సికా నేపస్,బ్రస్సికా కాంపేస్ట్రిస్ తదితర రకాల   మొక్కల గింజలను' రేప్ సీడ్స్' అంటారు.ఇవీ  చూడడానికి ఆవాలలానే ఉంటాయి. రేప్ సీడ్స్ లో కొన్ని పసుపు రంగులోనూ ఉండటాన కొందరు వాటిని పసుపు పచ్చ ఆవాలు అని వ్యవహరిస్తున్నారు. అయితే తెల్ల ఆవాలు (సిద్ధార్థ లేక శ్వేత సర్షప) గా పిలువబడే ఆవాలు కూడా చూడడానికి కొంత పసుపు   రంగులోనే ఉంటాయి. రేప్   గింజలనుంచి తీసే ముడి వంటనూనెను' రేప్ సీడ్ ఆయిల్' అంటారు.బ్రెడ్ తయారీలోనూ,దీపాలకు చమురుగానూ,సబ్బుల తయారీలోనూ ఈ ముడి నూనెను వాడతారు. దీన్నే శుద్ధిచేస్తే' కొల్జా ఆయిల్'అని పిలుస్తారు.ఇదికూడా వంట నూనెగానూ, సున్నితమైన యంత్ర పరికరాలకు కందెన(Lubricant)గానూ   వాడతారు.ఈ నూనె చెక్క(Oil cake)ను పశువుల దాణాగానూ, పంటలకు ఎరువుగానూ వాడతారు.మనం కూరల్లో వాడుకునే బ్రోకోలీ, కాలీ ఫ్లవర్,క్యాబేజీ,  నూల్-కోల్, టర్నిప్ లు కూడా ఇదే కుటుంబానికి చెందినవే.
                        తెల్ల ఆవాలను సంస్కృతంలో 'సర్షప','కటుస్నేహ','చారు సర్షప' వగైరా పేర్లతో పిలుస్తారు.ఇవి కారంగా,చేదుగా ఉంటాయి.వాత జ్వరాన్నీ,శ్లేష్మ జ్వరాన్నీ,క్రిమి రోగాన్నీ,దురదలనూ, చర్మ రోగాలనూ  పోగొడతాయి.'కుష్ఠ నాశ 'అనికూడా పిలువబడే తెల్ల ఆవాలు కుష్ఠు వ్యాధికి దివ్యౌషధం.హిందీలో 'సఫేద్ రాయ్' అని పిలువబడే వీటి శాస్త్రీయ నామం Brassica alba.రెండు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ మొక్క ఆకులు నూగుగానూ,పూలు పసుపు పచ్చగానూ ఉంటాయి.విత్తనాలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి బయటకు పసుపుపచ్చగానూ, లోపల తెల్లగానూ ఉంటాయి.
                          సంస్కృతంలో 'కృష్ణ సర్షప','ఆసురీ','తీక్ష్ణ గంధా' మొదలగు పేర్లతో పిలిచే నల్ల ఆవాలు కారంగా,చేదుగా,జిగటగా, రుచికరంగా ఉంటాయి.పొత్తికడుపు నొప్పి,కఫము, గుండె జబ్బు,దృష్టి దోషము, రక్త దోషము-- వీటిని పోగొడతాయి.నల్ల ఆవాల పొడిని మజ్జిగతో కలిపి తీసుకొంటే దురదలు, దద్దుర్లు,కుష్ఠు పుళ్లు వగైరా నయమౌతాయి.నల్ల ఆవాల పొడిని గోమూత్రము, నువ్వుల నూనె తో కలిపి కాచి ఆ నూనెతో తల అంటుకుంటే కుష్ఠు వ్యాధి నశిస్తుంది.హిందీలో 'బనారసీ రాయ్' అని పిలువబడే నల్ల ఆవాల శాస్త్రీయ నామం Brassica nigra.ఈ మొక్కలు ఆరు అడుగుల వరకు ఎత్తు పెరిగి పసుపు పచ్చటి పూలు పూస్తాయి.
                            సాధారణంగా మనం ఇళ్ళలో ఎక్కువగా వాడుకునే ఎర్ర ఆవాలను సంస్కృతంలో 'సుముఖా','సుప్రశస్తా' అనే పేర్లతో పిలుస్తారు.వీటికి' 'శోఫ  హారీ ' (వాపులూ, కణుతులను పోగొట్టేవి),  'నిద్రాకర' (నిద్రమత్తు కలిగించేవి), 'దాహకారీ'(దాహాన్ని కలిగించేవి) అనే పేర్లు కూడా ఉన్నాయి.
                            శ్లో. కఫానిల విషశ్వాస కాసదౌర్గంధ్య నాశన:
                                 పిత్త హృత్ పార్శ్వ శూలఘ్న స్సుముఖస్సముదాహృత:    (ధన్వంతరి నిఘంటువు)
                             ఎర్ర ఆవాలు కఫం, వాతం,విష శ్వాస,కాస దుర్గంధం నశింపజేస్తాయి.పిత్తాన్ని హరించి, పార్శ్వ శూలను నయం చేస్తాయి.
               అన్ని రకాల ఆవాల నుంచి  ఆవ నూనె తీస్తారు. తెల్ల ఆవాల నుంచి తీసే నూనెను ఉద్రేకాల ఉపశమనానికీ, దీపాల చమురుగానూ, కందెనగానూ ఉపయోగిస్తారు. నల్ల ఆవాలనుంచి తీసే నూనె ఘాటుగా ఉంటుంది.అది తగిలితే చర్మం మీద బొబ్బలు వస్తాయి.ముక్కులోనూ,కళ్ళలోనూ ఉండే పలుచటి చర్మపు  పొరలకు  ఈ నూనె హాని చేస్తుంది.దీన్ని సబ్బులు, మందుల తయారీలో వాడతారు.ఎర్ర ఆవాల నుంచి తీసే నూనె ఇలా ఘాటుగా ఉండదు.ఈ ఆవ నూనెను వంట నూనెగానూ, తలంటుకూ , ఒంటి మర్దనకూ ఉపయోగిస్తారు.
                  ఆవ పొడిని కొద్దిగా వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే వెంటనే వాంతులు అవుతాయి.ఆవ పిండి నోటిలోని ఉమ్మి గ్రంధులను ఉత్సాహపరచి, నోరూరింప జేస్తుంది.కడుపులోని పేగుల్లో కదలిక తెచ్చి విరేచనం అయ్యేట్లు చేస్తుంది.  లేత ఆవ ఆకులు,మొలకెత్తిన ఆవ విత్తనాలు ఆకు కూరగా వాడుకుంటారు. ఈ కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంచం వెగటుగా అనిపించినా ఆవకూర త్రిదోషాలనూ హరిస్తుంది. నీళ్ళ విరేచనాలనూ, పైల్స్ (మూల వ్యాధి)నూ తగ్గిస్తుంది. నీళ్ళ విరేచనాలు కట్టుకోడానికి   వేయించి కొట్టిన  ఆవ పొడిని కొద్దిగా వేడి అన్నంపై వేసి నేతితో తినిపిస్తారు.  ఆవ కూర గొంతుక రోగాలను కూడా  తగ్గిస్తుంది. ఎక్కువగా తింటే ఆవకూర మూత్ర బద్ధం చేస్తుంది.దీనికి విరుగుడు చండ్ర చెక్క పొడి.పాశ్చాత్యదేశాల్లో ఆవ పొడిని ఉప్పు, వెనిగర్ ,ధనియాలు,లవంగాలు,దాల్చిని చెక్క మొదలైనవి పొడి చేసి పేస్టులా  కలిపి పెట్టుకుని, ఆ పేస్టును కూరలలో వాడుకుంటారు.నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు చల్లటి నీటిలో మెత్తటి ఆవ పిండిని కలిపి మలాం పట్టీలాగా వేస్తారు.విష పదార్థాలు, ప్రమాదకరమైన మత్తు పదార్థాలు తీసుకున్న వారికి ప్రథమ చికిత్సగా  ఆవ పిండిని వేడి నీళ్ళలో కలిపి తాగించి వాంతి చేయిస్తారు.నరాల వ్యాదులకూ,కీళ్ళ సవాయికీ నల్ల ఆవాలు దివ్యౌషధం.న్యుమోనియా(Pneumonia), ప్లూరసీ (Pleurisy) వగైరాలలో నల్ల ఆవాల పొడితో మలాం పట్టీ వేస్తారు.నల్ల ఆవాలకు స్త్రీలకు గర్భపాతం కలిగించే, గర్భం రాకుండా నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి.
                 ఆవ నూనెతో తలంటుకున్నా  లేక తలంటుకు కొంచెం ముందుగా మెత్తటి ఆవపిండిని వేడి నీళ్ళతో కలిపి ఆ పేస్టును తలకు పట్టించినా  తల చర్మం (Scalp) లోని క్రిములు నశిస్తాయి. ఆవ పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే అన్ని చర్మ రోగాలు, క్రిమి రోగాలు, కుష్ఠు మొదలైన మొండి వ్యాధులు కూడా నశిస్తాయి. శరీర తత్త్వాన్నిబట్టి కొందరికి ఇది వికటించే అవకాశమున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెవిలో రెండు ఆవనూనె చుక్కలు వేసుకుంటే చెవిపోటు, వినికిడి సమస్యలు తగ్గిపోతాయి.ఆవ నూనెను వంటకు వాడుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.అగ్నిమాంద్యం నశించి ఆకలి పెరుగుతుంది. రేచీకటికి కూడా ఆవ దివ్యౌషధం.ఉదర రోగాలనీ, నీరసాన్నీ పోగొడుతుంది. ఆవ నూనెతో రోజూ కూరల తిరుగమోతలు పెట్టుకుంటూ,పై పూతగా ఆవనూనె రాస్తూ ఉంటే బోద కాలు నయమౌతుంది.ఆవాల పొడి ఉప్పు కలిపి నూరి తయారుచేసిన చూర్ణంతో పళ్ళు తోముకుంటూ ఉంటే దంత రోగాలు నశించి పళ్ళు దృడంగా తయారౌతాయి.ఆవాలు, మునగ చెక్క మెత్తగా నూరి పట్టు వేస్తే చెవి గూబ వాపు తగ్గుతుందని'భావ ప్రకాశిక' పేర్కొంది.
  పక్షవాతానికి 
ఆవ పిండిలో వాతులు కలిగించే,మూత్రం జారీచేసే గుణాలే కాక నరాల వ్యవస్థకు చురుకుదనం కలిగించే గుణం(Nervine Stimulant) కూడా ఉంది.ఆ కారణంగానే 
పక్షవాత రోగులకు ఆవ మేలు చేస్తుంది.ఆవ పొడిలో కొద్దిగా సిరకా (వెనిగర్)వేసి మెత్తగా కలిపి  పక్షవాతంతో పడిపోయిన శరీరభాగం పైన పట్టు వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆవ పొడిలో వెనిగర్ పోసి పలుచగా చేసిన పేస్టుతో రోజూ పడిపోయిన శరీర అవయవాలపైన రుద్దుతూ ఉంటే ఆ అవయవాలలో క్రమంగా కదలికలు వస్తాయి.ఆవ పొడితో కాచిన కషాయాన్ని రోజూ రెండు పూటలా తాగిస్తే పక్షవాతం క్రమంగా  నయమౌతుంది.
                  ఆవ  నూనెలో హారతి కర్పూరం కలిపి మర్దన చేస్తే కండరాలలోని వాతపు నొప్పులు, మెడ కండరాల బిగుతు(Stiffness of the neck) తగ్గుతాయి.డెంగ్యూ వ్యాధిగ్రస్థులకు ఒంటిపై ఆవనూనె పూస్తే ఉపశమనం కలుగుతుంది.బ్రాంఖై టిస్ తో   బాధపడుతున్నపసిపిల్లలకు చాతీ పై ఆవనూనె పూస్తే దగ్గు తగ్గుతుంది.
                    ఆవ పూలకు కూడా వైద్య పరమైన ప్రయోజనం ఉంది.తెల్ల ఆవ పూలను నీటితో నూరి, పలుచటి పేస్టులాగా తయారుచేసి ఒక గుడ్డపై వేసి కడుపు పైభాగంలో పట్టీ వేస్తే  కలరా రోగికి వచ్చే తగ్గని మొండి వాంతులు తగ్గుముఖం పడతాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితులలో ఆ పట్టీ  శరీరం పై పది నిముషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. అలా ఎక్కువసేపు ఉంచితే బొబ్బలు వచ్చే అవకాశం ఉంది.'సిద్ధార్థ' లేక 'శ్వేత సర్షప' అనికూడా పిలిచే తెల్ల ఆవాలతో తయారుచేసే 'సిద్ధార్థ ఘ్రుతం' ఎన్నో రుగ్మతలకు దివ్యౌషధం.వాచిన శరీర భాగాలపై తెల్ల ఆవాల నూనె తో రుద్దితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.తెల్ల ఆవ నూనె వంటనూనెల్లో శ్రేష్ఠమైనది. మూర్చ రోగులకూ, ఉన్మాదులకూ సిద్ధార్థ ఘ్రుతం బ్రాహ్మీ ఘ్రుతం తో కలిపి ఇస్తే ప్రయోజనం ఉంటుందని ' ఇండియన్ మెటీరియా మెడికా' గ్రంథంలోడా. కె.యం.నద్కర్నీ  పేర్కొన్నారు.నల్ల ఆవాలు పాము కాటు సందర్భంగా విష హరణానికీ వాడతారు.
ఆవతో ధూపన చికిత్స 
            ఆపరేషన్ తరువాత కుట్లువేసిన భాగాలలో చీముపట్టడం,మంట వగైరాలు రాకుండా సాధారణంగా వైద్యులు రోగికి  యాంటీ బయాటిక్స్, నొప్పి నివారక మందులు ఇస్తారు.పుణెలో ఓ వైద్యుడు ' వేపాకులు,గుగ్గులు,ఆవాలు,వస కొమ్ము ,ఉప్పు --వీటిని సమభాగాల్లో తీసుకుని' నిప్పులపై వేస్తే వచ్చిన పొగని పెద్ద ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వరసగా పదిరోజులపాటు ఉదయం, సాయంత్రం వేసి చూస్తే ఆపరేషన్ చేసిన భాగాలు ఏడు రోజుల్లోనే మానిపోయాయని 'గిరిజన వైద్య సర్వస్వం' అనే తన గ్రంథంలో డా.కొప్పుల హేమాద్రి పేర్కొన్నారు.
 విషమ జ్వరాలకు 
                  విషమ జ్వరాల  నివారణకు ఇలాంటి ధూపన చికిత్సే 'చరక సంహిత' లోని' చికిత్సా స్థానం' అనే అధ్యాయంలో కూడా చెప్పబడింది.పలంకష (Bdellium) అనే  సాంబ్రాణి వంటి ధూప ద్రవ్యం,వేప ఆకులు,వస కొమ్ములు,ఆవాలు,యవలు (బార్లీ), కుష్ఠం(చెంగల్వ కోష్టు - Saussurea lappa) , హరీతకీ (కరక్కాయ), నెయ్యి -ఈ  ద్రవ్యాలతో ధూపం వేస్తే ఎంతటి విషమ జ్వరమైనా నశిస్తుంది.('చరక సంహితా'--3 -307 ) 
కుష్ఠు వ్యాధి నివారణకు 
        ' సర్షప కరంజ కోశాతకీనాం తైలాన్యథా ఇంగుదీనాం చ '  అంటూ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు చరకుడు తన' చరక సంహిత' లోని 'చికిత్సా స్థానం' లో ('చరక సంహితా ' 7-119) కుష్ఠు నివారణకు పనిచేసే వివిధ తైలాలలో సర్షప తైలాన్నీ (ఆవ నూనెనూ) పేర్కొన్నాడు.మిగిలిన తైలాలు కరంజ(కానుగ- Pongamia glabra),కోశాతకీ (చేదు బీర-Luffa amara), ఇంగుదీ( గార-Balanites roxburghii)-- విత్తనాలనుండి తీసినవి.
            కుష్ఠు వ్యాధి నివారణకు వాడే' తిక్తేక్ష్వాక్వాది తైలం' కాయడానికి వాడే ద్రవ్యాలలో ఆవనూనె అతి ప్రధానమైనది.దారు హరిద్రా (మాను పసుపు),తిక్తాలాబు(చేదు సొర),పసుపు,ఏరండం(ఆముదం), మయూర,ఖర్పరిక అనే రెండు రకాల తుత్తము(Copper Sulphate) --వీటన్నింటినీ కలిపి ఆవ నూనెతో కాయాలని చరకుడు పేర్కొన్నాడు.(శ్లో.108-110- చికిత్సా స్థానం -'చరక సంహితా') 
              ఆవకు ఇంకా వైద్యపరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి.తెలుసుకొనాలనే ఉత్సాహమున్నవారు ఇక్కడ ఉదాహరించిన  గ్రంథాలు చదివి గ్రహించవచ్చు.
          
ఆహారంలో ఆవ 
                ఆవ పిండి కలిపి చేసే తాజా రోటి పచ్చళ్ళు , ఊరగాయలు మన  తెలుగువారి ఇళ్ళల్లో నోరూరిస్తూ ఉంటాయి.ఆవకాయ ఇష్టపడని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! మామిడికాయ ఆవకాయ కేవలం రుచిగా ఉండడమే కాక, జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. పప్పన్నంలో అందుకే ఆవకాయ పచ్చడి కలుపుకు తింటారు. ఆవకాయ పచ్చడి వాతాన్ని పోగొడుతుంది కానీ పైత్యం, కాక చేస్తుంది.కొత్తగా పచ్చళ్ళు పట్టినప్పుడు అన్నంలో  ఆవకాయతోనే ఎక్కువగా లాగించేస్తుంటాం.ఇలా ఆవకాయ మోతాదుకు మించి తినడం వల్ల కలిగే దుష్ఫలితాలకు నెయ్యి, పెరుగు, మజ్జిగ, కలి నీళ్ళు విరుగుళ్ళు. నెయ్యి వేసుకు తింటే ఆవకాయ రుచి తెలియదని కొందరు నెయ్యి వేసుకోరు.కాని మోతాదుకు మించి ఆవకాయతో తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినడమే మంచిది.దంచిన జొన్నలనుగానీ,బియ్యాన్ని కానీ  అన్నంగా వండబోయే ముందు నీటితో కడుగుతాం కదా.ఆ కడుగు నీటిని బానల్లో పోసి పులియబెడితే 
వచ్చేవే కలి నీళ్ళు.మితిమీరిన ఆవ ప్రభావానికి కలి నీళ్ళు  బలమైన విరుగుడు.
               మన తెలుగువారి ఇళ్ళలో ఉసిరికాయతోనూ,  ఆవకాయ ఊరగాయ పడతారు. దోస ఆవకాయ, దొండ ఆవకాయ, కాలీ ఫ్లవర్ ఆవకాయ మొదలైన తాజా పచ్చళ్ళు కూడా ఆవపిండి కలిపి చేస్తారు.గోదావరి జిల్లాలలో కూరలలోనూ ఆవ వాడకం ఎక్కువ.మిగిలిన ప్రాంతాల్లో కేవలం తిరుగమోతలూ, పచ్చళ్లలో మాత్రమే ఆవాలూ, ఆవ పిండీ వాడితే ఆ జిల్లాలలో కూరల్లో కూడా ఆవ పిండి కలుపుతారు.దీన్ని ఆవపెట్టడం అంటారు.
ఆవపెట్టిన పనస కూర, ఆవపెట్టిన కంద -బచ్చలి కలగూర రుచిలో వాటికవే సాటి.
                  ఇన్ని ప్రయోజనాలున్న ఆవను మనం నిర్లక్ష్యం చేస్తే ఆ సామెతలోని అవివేకి కంటే కూడా అవివేకులం అవుతాం కదా! అందుకే నేటినుంచీ 
మన ఆహారంలో ఆవ తగు మోతాదులో ఉండేట్లు జాగ్రత్త పడదాం.