Monday, July 22, 2013

పెండలం

                                                 
            
 మనకి తెలుసు --  ‘హాట్ చిప్స్’ షాపుల్లో పెండలం చిప్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంటుందని.  అడపాదడపా మనం ఇళ్ళల్లో పెండలం వేపుడు కూర, పులుసు చేసుకుంటూనే ఉంటాం. కొందరు పెండలాన్ని  పిండిగా  చేసి, దానితో రొట్టెలు చేసుకు తింటారు. ఆరు నెలలపాటైనా చెడకుండా నిల్వ ఉండే పెండలం దుంపలు కరవు ప్రాంతాలవారికి చక్కటి ఆహారం. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే ‘ఫుఫు' ( fufu) అనే వంటకాన్ని దీని నుంచే తయారు చేస్తారు. కొలంబస్, వాస్కో- డ-గామా, మాజిలాన్ మొదలైన సముద్రాన్వేషకులు మహాసముద్రాలపై ఓడల్లో చేసిన సుదీర్ఘ ప్రయాణాల్లో  ఈ పెండల౦ దుంపలే  వారి ఆకలిని  తీర్చాయి.  ఇప్పుడు అసలీ పెండలం ఏమిటో, దాని కథేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.

 వివిధ పెండలం జాతులు- వాటి పేర్లు

           భారతదేశపు యాభైకి పైబడిన  పెండలం జాతుల్లో పెద్ద పెండలం, చిన్న పెండలం ప్రధానమైనవి. మిగిలినవన్నీ అటవీ జాతులు కాగా, ఈ రెండు మాత్రమే సాగుచేయబడుతున్నాయి. పెద్ద పెండలాన్ని సంస్కృతంలో ‘ఆలూకమ్’ అనీ, ‘పిండాలు ‘ (పిండ+ఆలు) అనీ అంటారు. ఈ ‘పిండాలు’ శబ్దాన్ను౦చే తెలుగులో ‘పెండలం' శబ్దం ఏర్పడింది.  దీన్ని హిందీలో ‘చుప్రి ఆలు' అనీ, ‘ఖమాలు' అనీ అంటారు. కన్నడంలో ‘తెంగుగెనసు' అనీ, ‘హెగ్గెనసు' అనీ అంటారు. తమిళంలో ‘పెరుంవళ్ళిక్కిళంగు' అనీ, .మలయాళంలో ‘కాచ్చిల్' అనీ  అంటారు. ఇంగ్లిష్ లో ‘గ్రేటర్ యాం'  (Greater Yam)  అంటారు. చిన్న  పెండలాన్ని  తమిళంలో ‘వల్లీ కిళంగు'అనీ, ఇంగ్లిష్ లో Lesser Yam అనీ అంటారు. మనం  ఎక్కువగా ఈ రెండు రకాలనూ దుంపకూరగా వాడుకు౦టాం.

                     ఉష్ణ ప్రాంతాల్లో పెరిగే  పెండలం డయోస్కోరియేసీ (Dioscoreaceae) కుటుంబానికి చెందిన ఏక వార్షిక తీగ మొక్క.  ఇది యాభై అడుగుల వరకు పొడుగు  పెరుగుతుంది. పెద్ద పెండలం  శాస్త్రీయ నామం ‘డయోస్కోరియా ఆలాటా' (Dioscorea alata) కాగా  చిన్న పెండలం శాస్త్రీయనామం ‘డయోస్కోరియా  ఎస్కులెంటం' . ఆధునిక వృక్ష విజ్ఞానానికి ఆద్యుడు, ‘మెటీరియా మెడికా' గ్రంథకర్త,  క్రీ.శ. ఒకటవ శతాబ్దికి చెందిన గ్రీకు విజ్ఞాని పెడానియోస్ డయోస్కోరిడీజ్ (Pedanios Dioscorides) పేరిట ఈ  తీగ మొక్కకు ఆయన పేరు పెట్టబడింది.’ఆలాటా' అంటే ‘రెక్కలు కలది'(Winged) అని అర్థం. ఈ తీగ మొక్క కాండానికి (బీరకాయపైన తేలిన నరాలలాగానే)  పైకి తేలిన నాలుగు రెక్కలుంటాయి. తమలపాకుల్ని పోలిన ఈ తీగ ఆకులు హృదయాకారంలో  ముదురు ఆకుపచ్చ, లేతగా ఉన్నప్పుడు  ముదురు చాక్లెట్  రంగుల్లో  నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటాయి. ఆకులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. భూమిలోని వీటి వేళ్ళు దు౦పలుగా ఊరతాయి.ఒక్కొక్క దుంప ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల   బరువు వరకు కూడా ఊరతాయి.  దుంప పైభాగం  గరుకుగానూ,  పైన అంతా సన్నటి రోమాలు, బుడిపెలు  కలిగి ఉంటుంది.  దుంప లోపల జిగురుగల పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది.  ఈ తీగ వేళ్ళు నేలలో  దుంపలుగా  ఊరడమేకాక ఈ దుంపలు ఒక్కోసారి  ఈ తీగ  కాండం మీద కూడా వస్తాయి. వీటిని ‘ ఏరియల్ ట్యూబర్స్’ లేక ‘బల్బిల్స్' (Bulbils) అంటారు.కొందరు వీటిని పెండలపు కాయలు అని కూడా అంటారు.

                  ఇక ‘ఎస్కులెంటం’  (esculentum)   అంటే ‘ఆహారంగా ఉపయోగించేది’ అని అర్థం. (లాటిన్ లో ఎస్కా అంటే ఆహారం).ఈ మొక్క  వేళ్ళు  గుత్తులుగా ఊరతాయి. కేరళలోని పర్వత ప్రాంతాల్లో లభించే రుచికరమైన పెండలం జాతి శాస్త్రీయ నామం డయోస్కోరియా హామిల్టనీ (D. hamiltonii). పేదలు కరవు రోజుల్లో ఆహారంగా వాడుకునే మరోరకం  చిరు చేదు పెండలం డయోస్కోరియా బల్బీ ఫెరా(D. bulbifera).  దీన్ని హిందీలో పీత - ఆలూ అంటారు. చాణక్యుడు (కౌటిల్యుడు)రాసిన ‘అర్థశాస్త్రమ్' లో  ప్రస్తావించిన విషపూరితమైన పెండలం  డయోస్కోరియా డీమొనా (D. daemona). ఇది ఎంతగా విషపూరితమంటే- ప్రాచీన కాలంలో  పులుల్ని చంపడానికి ఈ దుంపల్ని వాడేవారట. ఇవికాక కష్-కష్ యాం, చైనీస్ యాం, గినీ యాం మొదలైన విదేశీ పెండలం రకాలు రుచికరమైనవిగా పేరొందాయి.

ఎక్కడినుంచి వచ్చింది ?

        పెండలం యొక్క ఇంగ్లిష్ పేరు ‘యాం' కు మూలం ‘నియాం' అనే శబ్దం. ఇది ‘మాండే’ భాషా శబ్దం. సుసులు, మాండేలు, మెండిస్ లు మొదలైన ఆఫ్రికా ఖండపు పశ్చిమ తీరంలో  నివసించే  జాతుల ప్రజలు
మాట్లాడే భాష ‘మాండే'. ఇది కాంగో భాషా కుటుంబం లోనిది.  వాయవ్య  ఆఫ్రికా నుంచి జిబ్రాల్టర్ జలసంధి గుండా  స్పెయిన్ లో ప్రవేశించిన మూరిష్ బానిసల (అరబ్బు, బర్బర జాతుల సంకరం కారణంగా పుట్టినవారు) ద్వారా ఈ శబ్దం  మొట్ట మొదటగా స్పెయిన్ లో ప్రవేశించింది. అయితే మూరిష్ జాతీయులు చేమ  దుంపల్ని ‘నియాం’అనేవారు. ఆ తరువాత స్పానిష్, పోర్చుగీసు ప్రజలు పెండలాన్ని ‘నియాం' అనడం మొదలెట్టారు.    ఈ శబ్దం ఆంగ్ల భాషలో ‘యాం' గా స్థిరపడక ముందు ఆంగ్లేయులు దీన్ని ‘ఇనియేం’(Iniame) అనీ, ‘యమ్మా’(Yamma) అనీ అనేవారు.అలా పెండలం పేరు వ్యుత్పత్తినిబట్టి అది  మూలంలో వాయవ్య ఆఫ్రికాకు చెందినదని  శాస్త్రజ్ఞులు ఊహించారు.


             ప్రపంచం మొత్తం మీద  పెండలం ( డయోస్కోరియా ) జాతిలో 600 కు పైగా ఉపజాతులున్నాయి. వాటిలో తినడానికి పనికొచ్చేవి  సుమారుగా పది   ఉంటాయి. ఈ జాతి  భూమి మీద గల  అతి  పురాతన వృక్ష జాతుల్లో ఒకటి. ఈ జాతి ఆఫ్రికా లోని ఉష్ణ ప్రాంతాలలో ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞులు తేల్చారు. పెండలాన్ని గురించి శాస్త్రజ్ఞులు తేల్చిన   అతి ఆశ్చర్యకరమైన విషయమొకటి ఉంది. అదేమిటంటే  పెండలం జాతులన్నిటికీ మూలమైన  ఆఫ్రికన్ పెండలం జాతి నుంచి ఆసియన్ పెండలం జాతులు విడివడి 26 మిలియన్ సంవత్సరాలకు పైనే అయిందట !!  అంటే -- రెండు కోట్ల అరవై లక్షల సంవత్సరాలపైనేనన్నమాట.

               భారతదేశపు పెండలం జాతి  దుంపలు  గోళాకారం, U- ఆకారం -- ఇలా వివిధ ఆకారాల్లోనూ, తెలుపు, ఎరుపు,  ఇంకా ముదురు ఎరుపు- నీలం రంగుల మిశ్రమ వర్ణంలోనూ  లభిస్తాయి. నేడు భారతదేశంలో పెరుగుతున్న  పెద్ద పెండలం జాతి జన్మస్థానం బర్మా- థాయిలాండ్ ప్రాంతం అయివుంటుందని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.  చిన్న పెండలం కూడా అదే ప్రాంతంలో ఉద్భవించినా, ఈ రెండు జాతుల సంకర రకాల్ని మనం పపూవా న్యూ గినీ లో ఎక్కువగా చూడొచ్చు. అటవీ పెండలం (డయోస్కోరియా పర్సిమిలిస్-  D.persimilis)  పై విశేష పరిశోధనలు చేసిన  స్కాట్లాండ్ కు చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు సర్  డేవిడ్ ప్రెయిన్ (1857-1944), ఇంగ్లాండ్ కు చెందిన వృక్ష శాస్త్రజ్ఞుడు ఐజాక్ హెన్రీ  బర్కిల్ ( 1870-1965)  భారతీయ పెండలం జాతులన్నీ బర్మా-థాయిలాండ్ ప్రాంతాలనుంచి భారతదేశానికి వచ్చాయని తేల్చారు.వీరి పరిశోధనల ఫలితంగా మొత్తం పెండలం జాతి రెండుగా వర్గీకరించబడింది. ఒకటి తీగ కుడివైపుకు అల్లుకుని పెరిగేవి. రెండు తీగ ఎడమ పక్కకు అల్లుకునేవి.పెద్ద పెండలం కుడి వైపుకు అల్లుకుని పెరిగే తీగ కాగా చిన్న పెండలం తీగ ఎడమ వైపుకు అల్లుకుని పెరుగుతుంది.

పెండలం సాగు

           పెండలం తీగల్ని దొడ్లలో పెంచుకోవడమే ఎక్కువ.  పంటగా సాగు చేయడమూ ఉంది. అయితే  అచ్చంగా  పెండలమే కాకుండా  అల్లం, పసుపు, వంగ, చిలగడ దుంప లేక మొక్కజొన్న లో అంతర పంటగా  పెండలాన్ని సాగుచేస్తారు.  పెండలం సాగుకు సారవంతమైన, లోతుగా దున్నిన భూమి శ్రేష్ఠం. పేడ  ఎరువు వాడుకుంటే దుంపలు బాగా ఊరతాయి.  నేలలో తేమ ఎక్కువగా ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు మురుగు నీరు పారుదల అయ్యే భూములే పెండలం సాగుకుమేలైనవి. ఎందుకంటే పెండలం ఆకులు, కాండం నీటి తడిని  ఏమాత్రం తట్టుకోలేవు. నేలలో తేమ ఎక్కువగా ఉన్నచోట్ల  తీగ ఆకులు, కాండం  కుళ్లకుండా కొందరు తీగలకు పందిళ్ళు వేసి,  వాటిపైకి పాకిస్తారు. పెండలం దుంపల పైభాగం కోసి విత్తితే మొలకలొస్తాయి. తీగకు కాసే పెండలం కాయల్నీ విత్తుకోవచ్చు. అయితే ఇలా కాయల నుంచి మొలిచిన తీగలకు పెండలం దుంపలు ఊరాలంటే  కనీసం రెండేళ్ళ  సమయం పడుతుంది. సాధారణంగా .తొలకరి వానల తరువాత పెండలం విత్తుకుంటారు. తీగలు నేలమీద అల్లుకుని పెరిగినప్పటికంటే, పందిరిపైకో  లేక ఏవైనా చెట్ల కొమ్మల మీదికో వాటిని పాకించినప్పుడు దుంపల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. విత్తిన నాటి నుంచి ఐదు నుంచి ఎనిమిది మాసాల్లో పంట చేతికొస్తుంది. దుంపలు పూర్తిగా ఊరిన తరువాత తీగకున్న  ఆకులు వాటంతటికవే రాలిపోతాయి. అప్పుడు తీగలు కత్తిరించి,  దుంపలు తవ్వి తీసుకోవాలి. కొన్ని పెండలం రకాల్లో  తీగ మొదలు దగ్గర ఒకటే దుంప ఊరితే, ఇంకొన్ని రకాల్లో  పలు దుంపలు  ఒకే గుత్తిగా ఉంటాయి. విత్తుకున్న రకాన్నిబట్టి, భూసారాన్ని బట్టి, చేనుకు అందించిన బలాన్నిబట్టి  దిగుబడి ఎకరాకు రెండు నుంచి పద్నాలుగు టన్నుల వరకు ఉంటుంది.పెండలం దుంపలు పొడి మట్టి లేక ఇసుకలో పాతిపెడితే ఆరు నెలల వరకు పాడు కాకుండా నిల్వ చేసుకోవచ్చు. నేల పొడిగా ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పెండలం తీగలు కోసేసిన తరువాత దుంపల్ని నేలలో అలాగే ఉంచేసి, అవసరం అయినప్పుడు తవ్వుకోవడం మంచిది.భారతదేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెండలం సాగు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలు, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలు పెండలం సాగుకు ప్రసిద్ధి.

ఆహారంగా పెండలం

               పెండలంలో   21 శాతం పిండి పదార్థాలు  ( 73 శాతం తేమ) ఉన్న కారణంగా  అది మంచి పోషక విలువలున్న ఆహారంగా పేరొందింది. ఆఫ్రికా, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలలోని పలు ప్రాంతాలలో దీన్ని ఆహార పంటగా పండిస్తున్నారు. పోషక విలువలున్న ఇదే జాతికి చెందిన  పలు అటవీ రకాలను కూడా ప్రజలు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పెండలం పంటలో
95 శాతం ఆఫ్రికా ఖండంలోనే పండిస్తున్నారు.నైజీరియా, బెనిన్, ఘనా, టోగో దేశాలు పెండలం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. పెండలాన్ని ముక్కలుగా కోసి, నూనెలో వేయించి, ఉడకబెట్టి లేక పిండి చేసుకుని ఆహారంగా  వాడుకుంటారు.  కరవులో వాడే ఆహారాలలో పెండలానిదే అగ్రస్థానం.అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో పెండలాన్ని పందులకూ, పశువులకూ పౌష్టికాహారంగా వాడుతున్నారు. కొన్ని జాతుల పెండలం      పై పొరలో ఆగ్జలేట్లు, ఆగ్జాలిక్ యాసిడ్ ఉండే కారణంగా అవి విషతుల్యం. పెండలం ముక్కల్ని కోసి, ఉడకబెట్టినా లేక వేయించినా వాటిలోని ఆల్కలాయిడ్లు, విషతుల్యమైన పదార్థాలు నశిస్తాయి. మనం కూరగాయగా వండుకునే శ్రేష్ఠమైన  విషరహితమైన రకాల పెండలాలు కూడా పచ్చివి తింటే, వాటిలో ఉన్న కాల్షియం ఆగ్జలేట్ క్రిస్టల్స్ కారణంగా నాలుక , గొంతు విపరీతంగా దురద పెడతాయి. అవే ఉడకబెట్టి లేక వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. సాగుచేస్తున్న పెండలం జాతులు రుచిలోనూ, నాణ్యత విషయంలోనూ  బంగాళా దుంపలతో పోటీ పడగలవు.  ఆలేటా ఉపజాతికి చెందిన పెండలం  స్టార్చ్ ని వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొన్ని జాతుల పెండలం దుంపల నుంచి ఆల్కహాల్ తయారు చేస్తున్నారు. కొన్నింటిలో  బి కాంప్లెక్స్ విటమిన్  పుష్కలంగా ఉన్నప్పటికీ పెండలంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ బాగా తక్కువే.  పెండలం జాతిలోని డెల్టాయిడియా మరియు ప్రజేరి ఉపజాతులు కంటి జబ్బుల్నీ,  కీళ్ళ వాతాన్నీ  నివారించేందుకు వాడే కార్టిజోన్ అనే స్టెరాయిడ్ హార్మోన్ ఉత్పాదనకు మూలం.ఆ రెండు ఉపజాతుల దుంపలనుంచి తీసిన స్టెరాయిడల్ శాపోజెనిన్ లు గర్భనిరోధక మాత్రల తయారీలో వాడతారు. డెల్టాయిడియా ఉపజాతి దుంపల్లో పుష్కలంగా ఉన్న శాపోనిన్ ల కారణంగా వాటిని పట్టు, ఊలు వస్త్రాలు మరియు కత్తిరించిన
శిరోజాలు శుభ్రపరిచేందుకు వాడతారు. చేప విషంగానూ ఉపయోగిస్తారు.

వైద్యంలో పెండలం   
                   
                పెండలం బాగా రుచిగా ఉంటుంది. మేహశాంతిని కలుగజేసి, బలాన్నీ, వీర్యపుష్టినీ ఇస్తుంది. నోటికి రుచి పుట్టిస్తుంది.  శరీరానికి చలువ చేస్తుంది.  కీళ్ళ వాతం (ఆర్త్రై టిస్ ) ని పోగొడుతుంది. కొద్దిగా కఫ, వాతాలు పెంచినా, పెండలం మూత్రకారిగా పేరొందింది. అది గు౦డెకూ, పొట్టకూ బలాన్నిస్తుంది.  పొట్టలోని క్రిములను నశింపజేస్తుంది. తీవ్రమైన పిత్త దోషం ఉన్నవారికి పెండలం ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధి, కుష్ఠు, గనేరియా, మూత్రం మంటగా చుక్కచుక్కగా పడడం, గుదంలో రక్తనాళం వాచి, తరచు రక్త స్రావం కావడం (హీమొర్రాయిడ్స్ -Haemorrhoids) మొదలగు వ్యాధులకు పెండలం దివ్యౌషధం.                                     
                   పెండలం పైత్యపు కాకనూ, దాహాన్నీ అణుస్తుంది. అయితే ఎక్కువగా తింటే అగ్నిమా౦ద్యం, మలబద్ధకం ఏర్పడవచ్చు. పొట్టలో వాయువు బిగదీయవచ్చు కూడా. ఇలాంటి సందర్భాల్లో విరుగుడుగా బెల్లం, తమలపాకులు పనిచేస్తాయి. పెండలపు తీగకు కాసే కాయలు కూడా పెండలపు దుంపలకున్న వైద్య పరమైన ప్రయోజనాలే కలిగివుంటాయి.

                             ఇదండీ పెండలం విచిత్ర గాథ. అప్పుడప్పుడూ పెండలంతో చేసిన చిప్స్, కూరలూ గట్రా తింటూ దాని ఉపయోగితా విలువలు నెమరేసుకుంటూ ఉంటారు కదూ! వచ్చే వారం మరో కూరగాథ తెలుసుకుందాం.
                
                                                       

No comments:

Post a Comment