వీటినే కొందరు ‘చిరగడ దుంపలు’ అంటారు. కొన్ని ప్రాంతాల్లో ‘చిలగడము' అనీ, ‘గెనుసు గడ్డలు’ అనీ కూడా అంటారు.’శబ్ద రత్నాకరము' వీటిని ‘గెనసు' గా పేర్కొంది. వీటిలో ఎరుపు, తెలుపు-- ఈ రెండు రంగుల దుంపలు లభిస్తాయి. చిలగడ దుంపల్ని నిప్పులమీద కాల్చుకుని లేక ఉడకబెట్టుకుని తింటారు. కొందరైతే తియ్యగా ఉండే ఈ దుంపల్ని పచ్చివే తినేస్తారు. అయితే అవి తేలిగ్గా జీర్ణం కావాలంటే కాల్చడమో, ఉడికించడమో చెయ్యాలి. పోషక విలువలు పూర్తిగా పొందడం కోసం వీటిని నిప్పులమీద కాల్చి, పొట్టు తీసుకుని తినడమే ఉత్తమం. కలగూర పులుసు, దప్పళము, సాంబారు వగైరాలలో చిలగడ దుంప ముక్కలు వేస్తారు. కూరల్లో వాడుకోవడమే కాదు; చిలగడ దుంపలతో పాయసమూ చేస్తారు. ఈ దుంపల్ని మెత్తగా ఉడికించి, ఆ పిండితో పూర్ణపు బూరెలు, బొబ్బట్లు కూడా చేసుకుంటారు. ఈ దుంపల్ని బాగా ఎండబెట్టి మెత్తటి పిండిగా దంచి, ఆ పిండితో ఉత్తర భారత దేశంలోని హిందువులు ఉపవాస దినాలలో తీపి బూరెలు, రొట్టెలు చేసుకు తింటారు. తురిమిన చిలగడ దుంపల తొక్కుతో చేసే తాజా ఆవ పచ్చడి విందు భోజనాలలో ఓ స్పెషల్ ఐటం ! ఇక ఇప్పుడీ చిలగడ దుంపల గాథేమిటో కొంచెం వివరంగా చూద్దాం.
మొక్క పేరు.. తీరు..
సంస్కృతంలో చిలగడ దుంపల్ని ‘పిండాలుః ‘అనీ, ‘రక్తాలుః ‘ అనీ అంటారు. హిందీలో ‘మీఠా ఆలు' (తీపి బంగాళా దుంపలు) అనీ, ‘శక్కర్ కంద్’ (తీపి దుంప) అనీ అంటారు. ఆంగ్లంలో వీటిని ‘స్వీట్ పొటాటోస్’(తియ్యటి బంగాళా దుంపలు) అంటారు.కన్నడంలో వీటిని ‘సిహి గెణసు', మలయాళ౦లో‘ మధురక్కిళన్ను’ అనీ, తమిళ భాషలో ‘చక్కరవళ్లి క్కిళ౦గు' అనీ అంటారు. చిలగడ దుంప మొక్క సన్నటి, నేలమీద పాకే బహువార్షిక తీగ మొక్క.ఆకులు బల్లెం ఆకారంలో ఒక్కోసారి లోతైన చీలికలు కలిగి ఉంటాయి.పూలు వంగపండు రంగులో గొట్టాలవలె ఉంటాయి.కాయలు చిన్న గోళాలవలె ఉంటాయి.ప్రతి కాయలోనూ రెండునుంచి నాలుగు విత్తనాలుంటాయి. అవి చిన్నవిగా, బల్లపరుపుగా, నల్లగా ఉంటాయి. తీగ కాండం యొక్క మొదట్లోని వేళ్ళూ , కాండం నేలను తాకిన చోట కణుపుల వద్ద పుట్టుకొచ్చే వేళ్ళూ ఊరి దుంపలుగా మారతాయి. ఒక్కో మొక్కకు బలాన్నిబట్టి రకరకాల పరిమాణాలలో నలభై నుంచి యాభై దుంపల వరకు వస్తాయి. కొద్ది అంగుళాల నుంచి మొదలెట్టి ఒక్కోసారి ఈ దుంపలు అడుగు పొడవు కూడా ఉంటాయి.అవి గోళాకారంగానూ లేక నూలు కండె ఆకారంలోనూ ఉంటాయి.ఒక్కో దుంప బరువు కొద్ది ఔన్సుల మొదలు రెండు మూడు పౌండ్లకు మించి కూడా ఉంటుంది.అరుదుగా మంచి కండ కలిగిన నేలల్లో ఒక్కో దుంప పన్నెండు పౌండ్ల బరువు వరకూ ఊరిన సందర్భాలూ ఉన్నాయి. ( రెండు పౌండ్ల మూడున్నర ఔన్సులు ఒక కేజీ బరువుకు సమానం)
చిలగడ దుంప మొక్క కన్వాల్వులేసీ (Convolvulaceae) కుటుంబానికి చెందినది.మన గ్రామీణులు దూసరి తీగ అనే అతి గట్టిగా ఉండే తీగ మొక్కను కట్టు తీగగా వాడతారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో కట్టుతీగ (Bind Weed)గా ‘మార్నింగ్ గ్లోరీ’ అనే కన్వాల్వులస్ జాతికి చెందిన తీగ మొక్కను వాడతారు. దాని పేరిటే మార్నింగ్ గ్లోరీ కుటుంబానికి కన్వాల్వులేసీ కుటుంబం అనే పేరు వచ్చింది. చిలగడ దుంప శాస్త్రీయ నామం ఐపోమీయా బటాటాస్ (Ipomoea batatas). గ్రీకు భాషలో ‘ఐప్స్' అంటే ‘కట్టు తీగ మొక్క’ (మార్నింగ్ గ్లోరీ తీగ); ‘హోమోఇయోస్ ‘ అంటే ‘వంటి' అని అర్థం. మార్నింగ్ గ్లోరీ తీగలా ఉండే మొక్కలన్నింటినీ ‘ఐపోమియా’ పేరిటే వ్యవహరిస్తున్నారు. ఇక ‘బటాటాస్’ లేక ‘బటేటాస్’ అనేది కరీబియన్ దీవుల (వెస్ట్ ఇండీస్) లోనిదైన హైతీ దేశపు వెస్ట్ ఇండియన్ మాండలిక పదం. చిలగడ దుంపల్ని సూచించే ఈ బటాటా పదం ను౦చే పొటాటో అనే పదం ఏర్పడింది. క్రీ.శ. 1597 లో జాన్ గెరార్డ్ అనే ఆయన మొదటిసారిగా బంగాళా దుంపల్ని వర్ణిస్తూ పొరపాటున వాటిని కూడా బటాటా అన్నాడు. ఇక అక్కడినుంచీ ఆంగ్లంలో పొటాటో (బటాటా) అనేది బంగాళా దుంపల పేరై కూర్చుంది.ఈ చిలగడ దుంప మొక్కను పోలినవే నీటిలో పెరిగే తూటి కాడ /తీగ (ఐపోమియా యాక్వాటికా), నీటి దాపుల్లో పెరిగే జిరిక లేక కొల్లి (ఐపోమియా నీల్) మొక్కలు. ఈ మొక్కలన్నింటి ఆకులు, గొట్టం పూలు, కాయలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
ఎక్కడినుంచి వచ్చాయివి ?
క్రీ.పూ.10,000-- 8000 మధ్య కాలం నాటివని భావించబడుతున్న గుహావశేషాలు చిలగడ దుంపల మూల జన్మస్థానం నిస్సందేహంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరు- మెక్సికో దేశాలేనని నిరూపించాయి. చిలగడ దుంప మొక్క ఐపోమీయా టిలియేసీ (Ipomoea tiliacea) అనే అటవీ జాతి మొక్క నుంచి ఆవిర్భవించిందనీ, ఆ మొక్క దక్షిణ అమెరికా ఖండపు ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే మొక్క అనీ శాస్త్రజ్ఞులు తేల్చారు.హవాయీ దీవులు, ఈస్టర్ దీవులు(చిలీ), న్యూజీలాండ్ మొదలైన చోట్ల కూడా ఈ దుంపలకు సంబంధించిన అతి ప్రాచీన అవశేషాలు బయల్పడ్డాయి. ‘రామాయణమ్’ చిలగడ దుంపను ‘పిండాలుక' అని పేర్కొంది. ప్రాచీన భారతీయ శస్త్ర చికిత్సా నిపుణుడు సుశ్రుతుడు చిలగడ దుంపల్ని మరింత స్పష్టంగా ‘మధ్వాలుక' (మధు+ఆలుక-- తీపి దుంపలు) అనే పేరుతో వ్యవహరించాడు. ప్రస్తుతం హిందీలో అందరూ వీటిని ‘శక్కర్ కంద్’ అంటున్నారు. ప్రాచీన తమిళ గ్రంథం ‘పురాణనూరు' ఈ దుంపల్ని ‘శక్కరై కిళ౦గు' అని పేర్కొంటూ అవి ఒక తీగమొక్క పాదం నుంచి ఉద్భవిస్తాయని పేర్కొంది.బహుశా ఈ చిలగడ దుంపలు మన దేశానికి దక్షిణ అమెరికా నుంచి కాక, మనకు తూర్పుగా ఉన్న దక్షిణ పసిఫిక్, మైక్రోనేసియా ప్రాంతాల నుంచి వచ్చి ఉండవచ్చునని కొందరు శాస్త్రవేత్తల అంచనా. .క్రీ.శ. 1615 లో ఎడ్వర్డ్ టెర్రీ, క్రీ.శ.1678 లో జాన్ ఫ్రయర్ తమ రచనలలో ‘పొటాటోస్’అంటూ ప్రస్తావించింది చిలగడ దుంపల్ని గురించే కావచ్చు. ఎందుకంటే బంగాళా దుంపలు అప్పటికింకా భారత దేశంలోకి ప్రవేశించలేదు.బ్రిటీష్ యాత్రికులు బంగాళా దుంపలనే కాదు చిలగడ దుంపలనూ అప్పటికి౦కా ఎరగరు. వారికి ఈ రెండూ కొత్తవే. అందుకే వారు చిలగడ దుంపల్ని చూసే వాటిని పొరపాటుగా ‘పొటాటోస్' అనే పేరుతో వ్యవహరించి ఉంటారు. అలా రామాయణ రచనా కాలానికి పూర్వమే ఈ దుంపలు భారత దేశంలోకి దక్షిణ పసిఫిక్ ప్రాంతాలగుండా ప్రవేశించి ఉంటాయని భావించవచ్చు.
చిలగడ దుంప సాగు
చిలగడ దుంపల్ని ఏడాది పొడుగునా సాగు చెయ్యవచ్చు. ప్రపంచంలోని ఉష్ణ ప్రాంతాలన్నిట్లో ఈ దుంపల్ని సాగు చేస్తున్నారు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీటిని సాగు చేస్తున్నారు. ఇసుక నేలలు, వెచ్చటి తడి వాతావరణం ఈ దుంపల సాగుకు శ్రేష్ఠం. దుంప పంటలలో బంగాళా దుంపలు, కర్ర పెండలం (Tapioca)లతరువాత సాగు విస్తీర్ణం రీత్యా మూడవ స్థానం చిలగడ దుంపలదే. ఈ పంట సాగులో బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గెనుసు గడ్డల మొత్తం వార్షిక దిగుబడిలో అరవై శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే కావడం విశేషం. మిగిలిన నలభై శాతం పంట కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళ నాడు, ఒడిసా మొదలగు రాష్ట్రాల నుంచి వస్తుంది. వాస్తవానికి మొదట్లో చిలగడ దుంపలు ఎరుపు, తెలుపు రంగుల్లోనే లభించినా ప్రస్తుతం వివిధ దేశాల్లో పలు వర్ణాల దుంపలు-- తెలుపు, మీగడ రంగు, పసుపు, గోధుమ రంగు, బంగారు వన్నె, ఎరుపు, గులాబీ వన్నె, రక్తవర్ణం మొదలైన పలు రంగుల్లో-- సాగవుతున్నాయి. మన దేశంలో సాగయ్యే ఎర్ర రంగు దుంపలు తెల్లవాటి కంటే తియ్యగా ఉంటాయి. ఉత్తర భారత దేశంలో ప్రజలు ఎర్ర చిలగడ దుంపలు ఇష్టపడితే దక్షిణాదివారు తెల్ల దుంపలు ఇష్టపడతారు. అయితే ఈ రెండు రకాల్లో ఎర్రవే తేలికగా జీర్ణమౌతాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ రూపొందించిన ‘పూసా సఫేద్', ‘పూసా లాల్' సంకర రకాలు మంచి దిగుబడినిచ్చే రకాలుగా రైతుల అభిమానాన్ని చూరగొన్నాయి.
పిండి (Starch), పెక్టిన్, షుగర్ సిరప్, మద్యం, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మొదలైనవాటి తయారీలో చిలగడ దుంపల్ని ముడి సరుకుగా వాడతారు. ఈ పిండిని వస్త్ర పరిశ్రమలోనూ, కాగితం, ఆహార మరియు కాస్మెటిక్ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు.ఈ దుంపలలో ఎ, బి, సి విటమిన్లు ఉన్నాయి. ప్రత్యేకించి ఎ విటమిన్ పుష్కలం.భారతీయ రకాలలో కంటే అమెరికన్ రకాలలో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయనీ, చిన్న దుంపలలో కంటే పెద్ద దుంపల లోనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయనీ, దుంపల పై భాగంలో కంటే లోపలి భాగాల్లోనే అవి ఎక్కువగా ఉంటాయనీ శాస్త్ర పరిశోధనల్లో రుజువైంది.ఈ దుంపల్లో చాలా కొద్ది మొత్తంలో మాంసకృత్తులు, కొవ్వులు కూడా ఉంటాయి.
ఆకుపచ్చగా ఉన్న ఈ మొక్క ఆకుల్ని పశువులు ఆబగా తింటాయి. అవి అత్యంత బలవర్థకమైన పశుగ్రాసమని రుజువైంది. ఈ దుంపల్లో నీటి శాతం చాలా ఎక్కువ(సుమారు 69 శాతం). ఆ కారణంగా అవి త్వరగా పాడయ్యే గుణం కలిగి ఉంటాయి. మొత్తం ప్రపంచంలో పండే చిలగడ దుంపల్లో ఏటా మూడో వంతు దుంపలు కుళ్ళి వృథా అవుతున్నాయట !! కుళ్ళి పాడయిన దుంపలతో సహా ఈ దుంపల్ని గుర్రాలు, పశువులు, పందులు అమిత ఇష్టంగా తింటాయి.
ఐపోమీయా జాతికి చెందిన మొక్కలలో కొన్ని వాటి ఆకర్షణీయమైన పూల కారణంగా ఉద్యానవనాల్లో పెంచబడుతున్నాయి. చిలగడ దుంప గురించి చెప్పుకునేటప్పుడు తప్పక ప్రస్తావించాల్సిన మరో విషయముంది.ఈ జాతికే చెందిన ఐపోమీయా డిజిటేటా (Ipomoea digitata) అనే మొక్క యొక్క పెద్ద దుంపను ‘భూ చక్కెర గడ్డ’(భూచక్ర గడ్డ) అంటారు. నా చిన్న తనంలో పసుపు, గోధుమ వన్నె కలగలసిన వర్ణం గల తోలుతో ఉన్న దాదాపు యాభై కేజీల బరువుండే అతి పెద్ద దుంపల్ని కొందరు స్కూళ్ళ దగ్గరకు తెచ్చి చాకుతో కొద్దికొద్దిగా పొర తీసి, ముక్కలు కోసి అమ్మేవారు. ఆ దుంప ముక్కలు తిమ్మిరి తిమ్మిరిగా అదో రకమైన రుచిగా ఉండి, అవి తిన్నవారికి వింత అనుభూతి కలిగేది. ప్రస్తుతం కనీసం చూద్దామన్నా ‘ భూ చక్కెర గడ్డలు’ఎక్కడా కానరావడం లేదు.
వైద్యంలో …
ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ దుంపలు జీర్ణం కావడం చాలా కష్టమని గుర్తించింది. వీటిలో పీచు అతి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే ఇవి కడుపు ఉబ్బరాన్ని(Flatulence) కలిగిస్తాయి. అంచేత వీటిని పరిమితంగానే తీసుకొనడం మంచిది. సంస్కృతంలో ‘ఆలు:’, ‘ఆలుక:’, ‘ఆలుకమ్' శబ్దాలు ‘తినదగిన వేరు దుంప' (An esculent root) అనే అర్థాన్నిస్తాయి. ‘రాజ నిఘంటు' అనే వైద్య నిఘంటువు తెల్ల చిలగడ దుంపల్ని ‘పిండాలు' (పిండ+ ఆలు) అనీ, ఎర్ర చిలగడ దుంపల్ని ‘రక్తాలు' (రక్త+ఆలు) అనీ వ్యవహరించింది.ఈ రెంటిలో రక్తాలు (ఎర్రటి రకం )బలవర్ధకమైనది.ఈ రెండు రకాలూ కాక శ్రీలంకలో సాగయ్యే గుత్తి చిలగడ దుంపల్ని(Cluster Sweet Potato) కూడా కొందరు శాస్త్రజ్ఞులు ప్రస్తావించారు. చిలగడ దుంపలు శరీరంలోని ఉష్ణ తాపాన్నీ , జ్వరాన్నీ తగ్గిస్తాయి. మూత్రకారిగానూ, విరేచనకారిగానూ ఇవి పనిచేస్తాయి. ఇవి బలవర్ధకమే కాక పురుషుల సెక్స్ సామర్థ్యాన్నీ పెంచుతాయి. తీవ్ర పిత్త దోషాలు, ఒంట్లో కాక, అరికాళ్ళ మంటలు, మలబద్ధకం, చక్కెర వ్యాధి, మూత్ర పిండాలలోనూ, మూత్ర సంచిలోనూ ఏర్పడే రాళ్ళు, మూత్రం మంటతో చుక్కచుక్కగా పడడం (strangury),సాధారణ బలహీనత వగైరాలను పోగొడతాయి. తేలు కాటులో బాధా నివారణకు ఈ దుంపలను కానీ, ఈ తీగ ఆకుల్ని కానీ మెత్తటి పేస్టుగా చేసి రాస్తే ప్రయోజనం ఉంటుందని డా. కె. యం. నద్ కర్ణి తమ ‘ది ఇండియన్ మెటీరియా మెడికా' గ్రంథంలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment